రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్-బీపాస్ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన ఏక గవాక్ష విధానం టీస్-ఐపాస్ తరహాలºనే టీఎస్-బీపాస్ ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదు. 75 చదరపు గజాల కంటే ఎక్కువ 600 చదరపు గజాల లోపు(500 మీటర్ల కంటే తక్కువ), పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి లభిస్తుంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస, నివాసేతర భవనాలకు కొత్త చట్టం ప్రకారం 21 రోజుల్లో అనుమతి వస్తుంది.
టీఎస్-ఐపాస్ తరహాలో వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు, నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తుదారుడు ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరంలేదు. ఉమ్మడి దరఖాస్తు దాఖలు చేస్తే అగ్నిమాపక, సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు, విమానయాన సంస్థల అనుమతికి దరఖాస్తు ఆటోమెటిక్‌గా వెళ్తుంది. సంబంధిత శాఖలు రిమార్కులను వారం నుంచి 15 రోజుల్లో పంపాలి. ఈ నిబంధన కూడా 600 చ.గ.పైబడిన నిర్మాణాలకే. టీఎస్-బీపాస్ భవన నిర్మాణ అనుమతుల్లో సమయపాలన, నిబంధనలు పాటించేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం టీఎస్-బీపాస్ ఛేజింగ్‌సెల్‌ను ఏర్పాటు చేస్తారు.
600 గజాలు దాటిన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 22వ రోజు పట్టణ ప్రణాళిక అధికారి, మున్సిపల్ కమిషనర్ రాజముద్రతో అనుమతి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్-బీపాస్) చట్టాన్ని తెచ్చేముందు సమీక్షించాం. అందులో 95 శాతం దరఖాస్తులు 600 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు సంబంధించినవే. అంటే ఈ చట్టం వల్ల 95 శాతం మందికి భవన నిర్మాణ తిప్పలుండవు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆనందాన్నిచ్చే బిల్లు ఇది’
- ఐటీ, పురపాలక శాఖ మంత్రి, కేటీఆర్