ఆంధ్రప్రదేశ్లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా 40,890 అర్హత సాధించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఐసెట్ ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించామని, రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు.
తొలి ఆరు వారివే..
మొదటి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల అభ్యర్థులు బీసీ, ఎస్సీ కులాలకు చెందినవారే ఉన్నారన్నారు. ఇందులో నలుగురు విద్యార్థినులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మొత్తం 352 కళాశాలల్లో 44,084 సీట్లు ఉన్నాయని వివరించారు. ఎంసీఏ కోర్సులో 130 కళాశాలల్లో 8,558 సీట్లు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు.
30 నుంచి డౌన్‌లోడ్..
ఎంబీఏలో కన్వీనర్ కోటా కింద 31,468 సీట్లు ఉండగా.. ఎంసీఏలో కన్వీనర్ కోటా పరిధిలో 6,229 సీట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. విద్యార్ధులు తమ ర్యాంక్ కార్డులను ఈ నెల 30 నుంచి ఉన్నత విద్యా మండలి సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఐసెట్ ఉత్తీర్ణత శాతం ఈసారి తగ్గిందన్నారు.
ఈసారి తగ్గింది..
2018లో 92.6 శాతం మంది ఉత్తీర్ణులు కాగా 2019లో 90.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈసారి మాత్రం 78.6 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పరీక్షలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు.