జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం - telangana
![జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం apex council meeting 25th august](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7292096-693-7292096-1590065559089.jpg)
19:48 August 18
జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల పరిధి, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, గోదావరి జలాల్లో వాటా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తరలింపు అంశాలు ఎజెండాగా భేటీ జరగనుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ మొదట ప్రతిపాదించింది.
అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల వీలు పడదని, 20వ తేదీ తర్వాత నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తాజా పరిస్థితుల్లో ఈ నెల 25వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది. 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం జరిగింది. 25న జరిగే సమావేశం రెండో భేటీ అవుతుంది.
ఇవీ చూడండి: కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ