జల వివాదాలపై తెలుగు రాష్ట్రాలు తమ వాదనలతో సిద్ధమయ్యాయి. నేడు జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ వాదనలను గట్టిగా వినపించనున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలోని అంశాల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, కేంద్ర జల్‌శక్తి అధికారులతో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు లేవనెత్తే అవకాశమున్న అంశాలు... కేసీఆర్ లేఖలో ప్రస్తావించిన విషయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలి
బోర్డులు ఏర్పడి ఆరేళ్లు దాటినా ఇప్పటివరకూ పరిధిని నోటిఫై చేయకపోవడం... దీంతో తలెత్తుతున్న సమస్యల గురించి... దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి.. తదితర అంశాలను కేంద్ర మంత్రి తెలుసుకున్నారు. పరిధి నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంటుండగా... నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేయనుండగా... రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ కోరనున్నట్లు తెలిసింది.
అంగీకారానికి రాకపోతే కొత్త ట్రైబ్యునల్
ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ... పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ లేవనెత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని... దీనిపై కూడా సమావేశంలో స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రి సంబంధిత అధికారులతో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని... కొత్తవి చేపట్టకుండా డీపీఆర్‌లు ఎలా ఇస్తామని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే ఉన్న ట్రైబ్యునల్ కొనసాగుతుందని... గోదావరిలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ అంగీకారానికి రాకపోతే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరం గురించి కేంద్రమంత్రి చర్చించినట్లు తెలిసింది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా విషయాన్ని తేల్చే బాధ్యతను ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కృష్ణా జలాలపై విచారణ జరపాలి