తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి అత్యున్నత మండలి సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర రావు, జగన్మోహన్ రెడ్డితో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాలు, కేంద్ర జలసంఘం ఛైర్మన్, కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు సమాచారం అందించింది. ఆ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం జరగనుంది.
పరస్పర ఫిర్యాదులతో..
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మిస్తోన్న, తలపెట్టిన ప్రాజెక్టులపై... రెండు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం ఉత్తర్వుల జారీతో ఫిర్యాదులు ఊపందుకొన్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లోనూ.. పరస్పరం భిన్న వాదనలు వినిపించాయి. పొరుగు రాష్ట్ర ప్రాజెక్టుల వల్ల... తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వాదించాయి.
రాయలసీమ ఎత్తిపోతలపై... తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొత్త ప్రాజెక్టుల పనులు ఆపాలని, ఫిర్యాదులు వచ్చిన ప్రాజెక్టుల సవివర ప్రాజెక్ట్ నివేదికలు ఇవ్వాలని... బోర్డులు ఇరు రాష్ట్రాలను కోరాయి. డీపీఆర్‌లు ఇవ్వాలని గతంలోనే పలుమార్లు సూచించినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవి అందడం లేదని వ్యాఖ్యానించాయి. ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రి లేఖ కూడా రాశారు. అటు రెండు రాష్ట్రాలు కూడా వివిధ అంశాలను పలు మార్లు లెవనెత్తుతూనే ఉన్నాయి. ఇతర బేసిన్‌కు జలాల మళ్లింపు నేపథ్యంలో ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం వాటా... చిన్ననీటివనరుల ద్వారా వినియోగం... నివాస అవసరాలకు 20శాతంగానే పరిగణన... కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌కి తరలింపు... కేటాయింపునకు మించి జలాల వాడకం... మిగిలిన జలాలను వచ్చే ఏడాదికి బదలాయింపు... తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.