హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడు అజారుద్దీన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. అపెక్స్ కౌన్సిల్ హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసింది. లోధా సిఫార్సుల మేరకే నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అపెక్స్ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారని.. అందులో ఆరుగురు మాత్రమే ఎన్నిక కాబడ్డారని తెలిపింది. మిగతా ముగ్గురిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుల క్రీడాకారుల తరఫున, ఇంకొకరు ఆడిటింగ్ నుంచి ఉంటారని స్పష్టం చేసింది. అజారుద్దీన్ కాకుండా మిగతా ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ అని.. ఐదుగురం కలిసి తీసుకున్న నిర్ణయమే షోకాజ్ నోటీసులని పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్ ప్రకటనతో హెచ్‌సీఏలో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఎన్నికై ఏడాదిన్నర అవుతోంది. ఈ మధ్యకాలంలోనే అజారుద్దీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. రంజీ ప్లేయర్‌ల ఎంపికలో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. తనకు సంబంధించిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పుమన్నాయి. ఆది నుంచే హెచ్‌సీఏలో వర్గపోరు మొదలైంది. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయి. కొందరు వ్యక్తుల అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు చేస్తున్నారని అజారుద్దీన్ పేర్కొన్నారు. విజయానంద్ కుమార్తె అండర్-19 అబ్జర్వర్‌గా వెళ్లిందని.. ఆమెకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహిస్తూ విజయానంద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. 25 ఏళ్లుగా హెచ్‌సీఏను కొందరు వ్యక్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయల నిధులు వస్తున్నా.. ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క మైదానమూ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదన్న అజారుద్దీన్.. అంబుడ్స్‌మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం.. అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.