ఆధార్ కార్డుల జారీ, సవరణలు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగడం వల్ల కార్డుదారుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించిన కేంద్రం... ప్రభుత్వ సంస్థల ద్వారానే ఆ కార్యక్రమం నిర్వహించేందుకు దశల వారీగా మార్పు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా-యుఐడీఏఐ.
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో పదిశాతం, తపాలా కార్యాలయాల్లో పది శాతం ఆధార్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా పోస్టల్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆధార్ జారీపై శిక్షణ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 14,366 తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ఏర్పాటు కాగా... అందులో 10,668లో మాత్రమే అమలవుతోంది. మిగిలిన వాటిలో వివిధ రకాల సాంకేతిక సమస్యల కారణంగా పని చేయకపోవడం వల్ల వాటిని కూడా పునరుద్ధరణ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తపాలా కార్యాలయాల ద్వారా కొత్త కార్డుల జారీ, సవరణలు మొత్తం కలిపి ప్రతి నెల 13లక్షల 66వేల నుంచి 15 లక్షల వరకు జారీ అవుతాయని యుఐడీఏఐ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒక్కో తపాలా కార్యాలయం నుంచి రోజుకు సగటున అయిదు కార్డులు మాత్రమే జారీ అవుతున్నట్లు స్పష్టం చేసింది.