శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరాయి. నీటి విడుదల గురించి ప్రతి నెలా బోర్డును కోరడం కాకుండా ఏకంగా డిసెంబరు వరకు అవసరమైన నీటి వివరాలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ బోర్డుకు పంపింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి 216 టీఎంసీలు విడుదల చేయాలని కోరింది. తెలంగాణ మాత్రం సెప్టెంబరు ఆఖరు వరకు అవసరమైన నీటిని కోరింది. 56 టీఎంసీలు విడుదల చేయాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాగు, సాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు ఆగస్టు, సెప్టెంబరు అవసరాలకు 71 టీఎంసీలు విడుదల చేయాలని ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్.. బోర్డుకు లేఖ రాసింది.
ఈ నీటి విడుదలకు బోర్డు ఆదేశాలు జారీ చేయాల్సి ఉండగా, దీనిని సవరించి డిసెంబరు వరకు 216 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు.
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలున్న నేపథ్యంలో డిసెంబరు వరకు అవసరమైన నీటికి ప్రతిపాదనలు పంపినట్లు లేఖలో వెల్లడించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు అవసరాలకు 90 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు.
అయితే వరద వచ్చి గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినపుడు తీసుకొన్న దాంతో సంబంధం లేకుండా 90 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. దీనిని బట్టి వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకొనే నీటిని పరిగణనలోకి తీసుకోరాదని గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించినట్లయ్యింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 20 టీఎంసీలు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 79 టీఎంసీలు, హంద్రీనీవాకు 27 టీఎంసీలు కోరింది.
ఇక్కడ కూడా ‘వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకొనే నీరు కాకుండా’ అని పేర్కొంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 13 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్ ఎడమ కాలువకు కలిపి 43 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు.
ఇవీ చూడండి:మా సర్కారు పథకాలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్