ఆంధ్రప్రదేశ్‌లో దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయలేని వారికి, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్నవారికీ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) మరో అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు తమ వద్ద ఉన్న ఆధారాలతో కలెక్టర్లను కలవాలని సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా కలెక్టర్లకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో నామినేషన్లు వేసేందుకు వెళ్లినప్పుడు అడ్డుకున్న సమయంలో ఎన్నికల అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతులు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ సూచించారు. వీటిపై విచారణ చేసి కలెక్టర్లు ఈనెల 20లోగా ఎన్నికల సంఘానికి నివేదికలు పంపితే ఎన్నికల సంఘం పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
బలవంతంగా ఉపసంహరించే నామినేషన్లను తిరిగి పునరుద్ధరించే అధికారం కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ప్రత్యర్థులు బలవంతం చేయడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లుగా ఎవరైనా తగిన ఆధారాలతో వస్తే అలాంటి నామినేషన్లు పునరుద్ధరించాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుందని ఎస్‌ఈసీ వివరించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలన్నీ ఉపయోగించాలని హైకోర్టు కూడా ఇటీవల తీర్పు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల్లోనూ బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి తిరిగి అవకాశం కల్పించాలని ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. మాచర్ల, పులివెందుల, రాయచోటి, పుంగనూరు, పలమనేరు పురపాలక సంఘాల్లో, తిరుపతి నగరపాలక సంస్థలో వార్డులు/డివిజన్లకు దాఖలైన ఏక నామినేషన్ల పైనా పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
కేంద్ర హోంశాఖ దృష్టికి దౌర్జన్యాలు