ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ‘ఇప్పటికే నిర్దేశించిన చట్టనిబంధనలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులున్నాయి. ఓసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ విషయంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే పలు తీర్పులున్నాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని.. పూర్తయ్యాక మాత్రమే సవాలు చేయగలరని సుప్రీంకోర్టు 2000లో కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక సింగిల్ జడ్జి జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది.
ఏపీలో ఎన్నికల పంచాయితీ : డివిజన్ బెంచ్‌కు ఎస్‌ఈసీ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించిన నిర్ణయంపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్.. డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లింది. సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వరుస సెలవులున్నందున అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్‌ను కోరారు.
కరోనా విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని సింగిల్ జడ్జి పొరపడ్డారు. కోర్టు ముందు సంబంధిత వివరాలేవీ లేకుండా వ్యాజ్య విచారణ దశలోనే ఆ నిర్ణయానికి రావడం సరికాదు. ఏపీ ఎస్‌ఈసీ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందున్నాయి. కరోనా టీకా వ్యవహారాన్ని కూడా ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకుంది.
ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యంలో అభ్యర్థించింది. కరోనా కేసులు పెరుగుతాయన్న కారణంతో ఎన్నికల్ని నిలువరించాలని కర్ణాటక, కేరళ, రాజస్థాన్ హైకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలైనా న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేదు. వాటన్నింటినీ సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టుకు విచారణాధికార పరిధి పరిమితంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని సోమవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి’ అని ఎస్‌ఈసీ అభ్యర్థించింది.
- ఇదీ చూడండి :శరీర ప్రకృతిని అనుసరిస్తేనే ఆరోగ్యం