ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఏపీ పోలీసులు AP police is suppressing democratic rights: నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ప్రాథమిక హక్కులో భాగం. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదులు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు చెప్పినా పోలీసులు అనుమతి నిరాకరించటం సరికాదు. క్రమశిక్షణ కలిగిన ఓ రాజకీయ పార్టీ వంద మందితో శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తామంటే మీకు అభ్యంతరం ఎందుకు? ఇవీ.. కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం సీపీఐ తలపెట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలంటూ గురువారం ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఇదే కాదు.. అంతకుముందు అమరావతి మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసుల వైఖరిపైనా.. హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది.
రాజకీయ నేతలు వేల మందితో పాదయాత్రలు చేయొచ్చు కానీ.. 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదా?. దానికి మీరు అనుమతివ్వరా?. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఎలా కాదంటారు?. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో అనుమతి ఎలా నిరాకరిస్తారు?. ఒక వర్గం ఆకాంక్షలకు భిన్నంగా మరో వర్గం ఎప్పుడూ ఉంటుంది. ఆ కారణం చెప్పి నిరసన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించటం సరికాదని గతంలో సుప్రీంకోర్టూ చెప్పింది అని.. సెప్టెంబరు 9న రైతుల పాదయాత్రకు అనుమతిచ్చిన సందర్భంగా హైకోర్టు స్పష్టంచేసింది.
ఈ రెండు సందర్భాల్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో అర్థమై ఉంటుంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఎంతగా సాగిలపడిందో. రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాలకు మాత్రమే ప్రత్యేక ఆంక్షలు, నిర్బంధాలు వర్తిస్తాయి. వారి హక్కుల కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడటం, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపటం, శాంతియుత ప్రదర్శనల ద్వారా ఆవేదన వినిపించడం, బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపటం, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం ఏపీ పోలీసుల దృష్టిలో అతి పెద్ద నేరాలు. శాంతిభద్రతలకు, నేర నియంత్రణకు ఆటంకం కలిగించే ఘటనలు. అందుకే వెంటనే పోలీసు చట్టం సెక్షన్ 30, సీఆర్‌పీసీ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చేస్తారు, ర్యాలీలు, నిరసనలు, కార్యక్రమాలకు అనుమతి లేదంటూ ప్రకటనలిచ్చేస్తారు. న్యాయస్థానాలు అనుమతిచ్చినా ఏదో సాకు చూపి కార్యక్రమాల్ని అడ్డుకుంటారు. నోటీసులు, గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు మొదలుపెట్టేస్తారు. కాలు కదపకుండా అష్టదిగ్బంధనం చేసేస్తారు. కేసులు కట్టేసి ముప్పుతిప్పలు పెడతారు.
అదే.. అధికార వైసీపీ అరాచకాలకు మాత్రం పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతిపక్ష నాయకులపైకి, పాదయాత్ర చేసే రైతులపైకి రాళ్లు, చెప్పులు విసరటం, డీజిల్ ప్యాకెట్లు, జెండా కర్రలతో దాడి చేయటం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించటం వంటివన్నీ మన పోలీసుల దృష్టిలో నిరసన తెలిపే చర్యలు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునే కార్యక్రమాలు. అందుకే కళ్ల ముందు ఇలాంటివి జరుగుతున్నా వారు చూస్తూ ఉంటారు. చేస్తున్నది అధికార పార్టీ వారు కాబట్టి కావాల్సినంత రక్షణ కూడా కల్పిస్తారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే తీరు. ఇప్పుడది మరింత పరాకాష్ఠకు చేరింది. దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంటుంది. ఏపీలో ఆ ఊసే ఉండదు.
ప్రతిపక్ష నాయకులు తలపెట్టే కార్యక్రమాలపై పోలీసులు ఎంత పెద్ద ఎత్తున నిర్బంధాలు అమలు చేస్తున్నారో చెప్పేందుకు గతవారం రాష్ట్రంలో జరిగిన ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు. తాడిపత్రిలో అభివృద్ధి పనులకు నిధుల్లేవంటూ తెలుగుదేశం నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ‘భిక్షాటన’ చేపట్టారు. పోలీసు చట్టం సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కర్నూలులో రాయలసీమ గర్జన పేరిట వైసీపీ నాయకులు సీమ ప్రజలను మోసం చేశారని.. సభ జరిగిన మైదానాన్ని పాలతో శుద్ధి చేస్తానంటూ భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కార్యక్రమం తలపెట్టగా ఆయన్ను ఇంట్లో నిర్బంధించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు.. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై చేసిన విధ్వంసానికి నిరసనగా యాదవ సంఘాలు ‘చలో పుంగనూరు’కు పిలుపునివ్వగా.. అనుమతి లేదంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో రామచంద్రయాదవ్‌కు వ్యతిరేకంగా కొంతమంది మహిళలు ధర్నా చేస్తే అభ్యంతర పెట్టలేదు. పైగా వారికి బందోబస్తు ఏర్పాటు చేశారు. జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్‌కుమార్ దళితుడైన డాక్టర్ సుధాకర్ స్మారక సభను విశాఖపట్నంలో నిర్వహించేందుకు ప్రయత్నించగా అనుమతుల్లేవంటూ అడ్డుకున్నారు. హైకోర్టు అనుమతిచ్చినా సభ జరగనివ్వలేదు. పోలీసుల తీరుపై హైకోర్టులో దిక్కరణ పిటిషన్ వేస్తానని శ్రవణ్‌కుమార్ చెప్పారు.ఐనా సరే మన పోలీసుల్లో చలనం లేదు.
అమరావతి రైతులు పాదయాత్రలకు అనుమతి కోరగా.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో వారు హైకోర్టు అనుమతి తెచ్చుకుని పాదయాత్ర చేపట్టారు. యాత్ర సజావుగా జరిగేలా చూడాల్సిన పోలీసులు.. వారిపైనే ఆంక్షలు విధించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిరసనల పేరిట రైతుల పాదయాత్ర మార్గానికి అడ్డంగా వెళ్లి దాడులకు తెగబడిన వైసీపీ నాయకులు, శ్రేణులకు కొమ్ముకాశారు. శాంతిభద్రతలను పరిరక్షించాలనుకుంటే హైకోర్టు అనుమతితో సాగుతున్న రైతుల పాదయాత్ర మార్గంలో వారికి పోటీగా, రెచ్చగొట్టేలా నిరసనలు తెలిపేందుకు పోలీసులు ఎందుకు అనుమతించినట్లు? అంటే అధికారపక్ష నాయకులు కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తవా? ప్రతిపక్షాలు నిరసన తెలిపితేనే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయా?
మీ నిరసనలు మీరు చేసుకోండి.. కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు ’ అని పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి చెబుతున్నాం. ఈ ఏడాది అక్టోబరు 14న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకర్లతో అన్న మాటలివీ. ఆ హక్కు అధికార పార్టీ నిరసనలకు మాత్రమేనా? ప్రతిపక్షాలు, ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు వర్తించదా? చట్టం అధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్షాలకు మరోలా ఉంటుందా? ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులవి హక్కులు కావా? వారికి భావప్రకటన స్వేచ్ఛ లేదా? ఉంటే వారి శాంతియుత నిరసన కార్యక్రమాలకు ఎందుకు అనుమతివ్వట్లేదు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు గొంతెత్తకూడదా? ఇదెక్కడి న్యాయం? ఇదేం పక్షపాత ధోరణి? వీటన్నింటికి పోలీసు బాస్ సమాధానం చెప్పగలరా.
వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలపై నిర్బంధాలు మొదలైపోయాయి. పల్నాడులో వైసీపీ నాయకుల చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 2019 సెప్టెంబరులో ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వగా.. ఆయన్ను ఉండవల్లిలోని నివాసం నుంచే బయటకు రానీయకుండా తాళ్లతో గేట్లు కట్టేసి అడ్డుకున్నారు. అదే ఏడాది నవంబరులో చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్‌పై కొంతమంది రాళ్లు, చెప్పులు విసిరారు.
దీనికి అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ‘నిరసన తెలపటం భావ ప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగం ఆ హక్కు ప్రతి ఒక్కరికీ కల్పించింది ’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీనిపై అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను న్యాయస్థానానికి పిలిపించి మరీ హైకోర్టు ఆక్షేపించింది. తర్వాత కొవిడ్ నిబంధనలు, ఆంక్షల పేరిట ప్రతిపక్షాల నిరసనలకు అనుమతివ్వలేదు. అదే సమయంలో అధికార వైసీపీ భారీ ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకోలేదు సరికదా.. బందోబస్తు కల్పించి మరీ కొమ్ముకాశారు. అదిప్పుడు పరాకాష్ఠకు చేరింది.
ఇటీవల చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు చూడటానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. రుషికొండలో నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న తెలుగుదేశం శ్రేణులను అడ్డుకున్న పోలీసులు రణరంగం సృష్టించారు. వందల మందిని గృహనిర్బంధం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జనవాణి నిర్వహించేందుకు విశాఖపట్నం వెళితే.. వాహనం నుంచి బయటకు కనిపించడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఆయన బస చేసిన హోటల్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించి అలజడి సృష్టించారు. ఆయన్ను హోటల్ నుంచి బయటకు రానీయకుండా చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ నోటీసులిచ్చి..విశాఖపట్నం నుంచి బలవంతంగా పంపించేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లేందుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నించగా ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు ఇలానే వ్యవహరిస్తున్నారు.
అదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో పర్యటించినా అక్కడ ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండవు. ముందు రోజు రాత్రి నుంచే అక్కడి ప్రతిపక్ష, ప్రజా సంఘాల, ఉద్యమ నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇళ్లలోనే నిర్బంధిస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడల్లా రోజుల తరబడి సెక్షన్ 30, ఐపీసీ సెక్షన్ 144 కింద ఆంక్షలు విధిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నిరసనలు, ప్రదర్శనలనూ ఉక్కుపాదంతో అణిచేస్తున్నారు. ఆయా సంఘాల ప్రతినిధులందరికీ నోటీసులివ్వటం, గృహనిర్బంధాలు, అడ్డుకోవటం, భారీ ఎత్తున బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురిచేయటమే పని అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీపీఎప్ రద్దు చేయాలన్న డిమాండుతో ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఆయా సంఘాల నాయకులకు నోటీసులిచ్చి నిర్బంధించారు. కేసులు పెట్టి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తున్నారు.
ఇవీ చదవండి: