ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నరుకు రాసిన లేఖలో వాడిన భాష బెదిరింపు ధోరణిలో ఉందని.. ఇది శాసనసభ్యులుగా తమ హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసనసభ స్పీకరుకు శనివారం వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ లేఖపై తగిన చర్యలు తీసుకుని.. తమకున్న సభా హక్కులను కాపాడాలని కోరారు. ‘మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లక్ష్మణరేఖ దాటారు, ఎన్నికల నియమావళిని అతిక్రమించారు’ అని ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ గవర్నరుకు రాసిన లేఖపై మంత్రులిద్దరూ వేర్వేరుగా శాసనసభాపతికి ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదుల్లో విషయం ఒకేలా ఉంది. వివరాలు ఇవీ..
ఎస్ఈసీ లేఖలోని అంశాలపై చర్య తీసుకోండి.. స్పీకర్‌కు మంత్రుల ఫిర్యాదు
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖపై ఆ రాష్ట్ర మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ గవర్నర్ కు రాసిన లేఖలో వాడిన భాష బెదిరింపు ధోరణిలో ఉందని పేర్కొన్నారు. ఆ లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘బాధ, ఆవేదనతో ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. సీనియర్ శాసనసభ్యులుగా, మంత్రులుగా మాకు రాజ్యాంగ వ్యవస్థలపైనా.. ప్రత్యేకంగా ఎన్నికల సంఘంపైనా అపారమైన గౌరవం ఉంది. కానీ, మాపై ఎస్‌ఈసీ సత్యదూరమైన, నిరాధార ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అవమానించేలా గవర్నరుకు లేఖ రాశారు. ఎస్‌ఈసీ రహస్య అజెండాతో రాసిన ఆ లేఖలోని అంశాలు భయపెట్టే ధోరణిలో ఉన్నాయి. అగౌరవకరమైన భాషతో మమ్మల్ని అవమానించేలా ఉన్నాయి. తప్పుడు వ్యాఖ్యలతో ఉన్న ఆ లేఖ మమ్మల్ని ప్రజల దృష్టిలో పలుచన చేసేలా ఉంది. శాసనసభ్యులమైన మాపై ఆయన వాడిన భాష బెదిరింపు ధోరణిలో ఉంది. ఇది మా హక్కులకు భంగం కలిగించేలా ఉంది. శాసనసభాపతిగా మా హక్కులను పరిరక్షించాల్సిన సంరక్షకుడిగా మీరు ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ రాసిన లేఖపై తగిన చర్యలు తీసుకోవాలి. మాకున్న సభా హక్కులను కాపాడాలి’’ అని ఏపీ మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మీడియా పోరాటం అభినందనీయం: కేటీఆర్