కృష్ణా జలాల వివాదం (Krishna Water Dispute) రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Ap Cm Jagan) తెలంగాణ మంత్రులపై చేసిన వ్యాఖ్యల అనంతరం... ఆ రాష్ట్రమంత్రులు కృష్ణా జలాల వివాదంపై స్పందించారు. కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు ఏపీ మంత్రి అనిల్ అన్నారు. తక్కువ సమయంలో నీళ్ల కోసం సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని అనిల్ పేర్కొన్నారు.
చేతకానితనం కాదు...
సాగునీటి అవసరాల తర్వాతే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయాలని అనిల్ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోందని ఆరోపించారు. మా సంయమనం చేతకానితనం కాదన్నారు. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే 2 రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దామని సూచించారు. పాలమూరు, డిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదని విమర్శించారు. అనుమతులు లేకుండా తెలంగాణ ఎన్నో ప్రాజెక్టులు కడుతోందని అనిల్ అన్నారు. పాలమూరు, డిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదన్నారు. తెలంగాణ మంత్రులకు రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని అనిల్ పేర్కొన్నారు. మాకు మాత్రం మా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రులకు ఒక్కటే చెబుతున్నా... నిజంగా తెలంగాణ ప్రజలకు రాజశేఖర్రెడ్డి చీమంత అన్యాయం చేసినా... 2009లో మళ్లీ గెలిచేవారు కాదు. అత్యధిక సీట్లు వచ్చింది కూడా తెలంగాణ ప్రాంతం నుంచే. వాటర్ ఇష్యూ అనేది సున్నితమైంది. వాళ్లకంటే మేం ఎక్కువే తిడతాం. అన్నింటికి ఇక్కడ తెగించి ఉన్న మంత్రులమే ఉన్నాం. అందరికీ నోర్లు ఉన్నాయి గట్టిగా మాట్లాడుతాం.
--- అనిల్ కుమార్ యాదవ్, ఏపీ మంత్రి