తెలంగాణలో స్థిరపడిన వారు ఏపీకి రావాలని చూస్తున్నారని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల వద్ద ఏపీ బస్సులు ఉంటాయన్నారు. సరిహద్దు నుంచి గ్రామాలకు చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
"కర్ణాటక, తమిళనాడుకు బస్సుల పునరుద్ధరణ జరిగింది. జూన్ 18 నుంచి తెలంగాణతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారు. కనీసం పండగ వరకైనా బస్సులు నడపాలని తెలంగాణ అధికారులను కోరాం. మూడ్రోజులు సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యమైంది. మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ఆర్టీసీతో చర్చలు జరిపాక తుది నిర్ణయం తీసుకుంటాం. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం."