సభా హక్కుల సంఘం శాసనసభ కమిటీ హాలులో మంగళవారం సమావేశమైంది. ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గతంలో శాసనసభలో చర్చ సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యపై సభా వేదికగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశారు. పింఛన్ల సంఖ్య విషయంలో రామానాయుడిపై స్వయంగా ముఖ్యమంత్రి సభలోనే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఫిర్యాదులపై వారిద్దరూ సరైన వివరణ ఇవ్వనందున వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు మాత్రమే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. సభాపతి తమ్మినేని సీతారాంపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు విషయంలో అచ్చెన్నాయుడు గత సమావేశానికి వ్యక్తిగతంగా హాజరై విచారం వ్యక్తం చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ ఫిర్యాదును కొట్టేసింది.
నిమ్మగడ్డకు ఆ సమాచారం పంపండి
మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇంటినుంచి బయటకు రాకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వలేదని, అలాంటి ఆదేశాలు తానిచ్చినట్లు ఉంటే ఆ వివరాలను పంపాలని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోరారని సమావేశంలో ప్రస్తావించారు. గతంలో ఆయనిచ్చిన ఉత్తర్వులు, మంత్రులు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవడం వంటి వివరాలతో కూడిన సమాచారాన్ని నిమ్మగడ్డకు పంపాలని కమిటీ అధికారుల్ని ఆదేశించింది.
శాసనసభ్యుల అభిప్రాయం మేరకు వారిద్దరిపై చర్యలు
సమావేశం అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘శాసనసభను తప్పుదారి పట్టించారన్న ఫిర్యాదులపై అచ్చెన్నాయుడు, రామానాయుడిపై చర్యలకు శాసనసభకు సిఫారసు చేస్తాం. శాసనసభ్యుల అభిప్రాయం మేరకు సభాపతి తదుపరి చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. అంతేతప్ప ఆయన ‘మైక్‌కట్’ అంశాన్ని ప్రస్తావించలేదు. ‘ఆగస్టు 31న జరిగిన సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అందుబాటులో లేనని.. నోటీసు అందలేదని గైర్హాజరైనట్లు సభాపతి వ్యక్తిగత కార్యదర్శి కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ రోజు రవికుమార్ అందుబాటులో లేనట్లుగా నిరూపించుకోవాలి. లేకపోతే ధిక్కారం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీకి సిఫారసు చేయాలని నిర్ణయించాం. అందుబాటులో ఉండి రవి గైర్హాజరు అయ్యారనడానికి ఆధారాలను సమర్పించాలని సభాపతి వ్యక్తిగత కార్యదర్శికి చెప్పాం’ అని వివరించారు.