AP HC Suspended The GO No 1: రోడ్ షోలు, ర్యాలీలు నిషేధిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను ఆ రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో నెం.1 ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన జీవో నెం 1పై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు గొంతెత్తకుండా నిరోధించేందుకే ఈ చీకటి జీవో తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు ఘటనే ఈ జోవో తీసుకురావడానికి కారణమని.. ప్రభుత్వం చెపుతున్న ప్రతిపక్షాలు మాత్రం కేవలం తమ గొంతుకను వినిపించనీయకుండా చేయడానికే అని తీవ్ర విమర్శలు చేశాయి.