AP HC ON MLC DRIVER MURDER CASE: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. సీసీ ఫుటేజ్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను 15 రోజుల్లో తీసుకోవాలని ఆదేశించింది. నివేదిక పరిశీలించి హత్యలో వ్యక్తుల పాత్ర నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం వేయాలని హైకోర్టు సూచించింది. 3 నెలల్లోగా తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతేడాది ఏపీలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఇదీ జరిగింది: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ.. ఈనెల 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్ ఫోన్ చేసి .. నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు.