AP High-count on PPA: గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కాబట్టే యూనిట్ టారిఫ్ ధరలను తగ్గించాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి వద్ద పిటిషన్ దాఖలు చేశాయని హైకోర్టుకు పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు నివేదించాయి. పారదర్శకంగా జరిగిన బిడ్డింగ్ విధానంలో ఈఆర్సీ పర్యవేక్షణ అనంతరం టారిఫ్ ధరలను ఓసారి నిర్ణయించారన్నారు. ఆ ధరలను సవరించాలని కోరే అధికారం డిస్కంలకు, ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని విచారణ చేసే అధికారం ఈఆర్సీకి లేదన్నారు. తాజాగా జరిగిన విచారణలో ఈఆర్సీ విచారణాధికారంపై వాదనలు ముగిశాయి. పవన, సౌర సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోవడంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కోత విధించడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంటూ.. విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిన్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి ఉంది: ఏజీ శ్రీరామ్
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ ఈఆర్సీ సమీక్షించేందుకు వీలుకల్పిస్తూ.. 2019 లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్ యూనిట్‌కి రూ .2.44, పవన విద్యుత్ రూ .2.43 చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశించడంపై అభ్యంతరం తెలిపాయి. మరోవైపు పవన, సౌర విద్యుత్ యూనిట్ టారిఫ్‌ను సవరించాలని కోరుతూ.. ఈఆర్సీ వద్ద డిస్కంలు పిటిషన్ దాఖలు చేయడాన్ని సవాలు చేస్తూ విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టులో వ్యాజ్యాలు వేశాయి. పీపీఏలు, యూనిట్ ధరలను నిరంతరం సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి ఉందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు అందుకు అనుమతిస్తున్నాయన్నారు. పరిస్థితులు మారినప్పుడు టారిఫ్ ధరలను నియంత్రించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.