ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న వేళ.. ప్రక్రియ నిలిపివేత కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయలేమని తేల్చిచెప్పింది. తదుపరి ప్రక్రియపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్‌ఈసీని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఎస్‌ఈసీకి స్పష్టం చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేం: ఏపీ హైకోర్టు - ap high court on local body elections latest news
ఏపీలో ఎన్నికల ప్రక్రియ నిలివేయడం కుదరదని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి ప్రక్రియపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్‌ఈసీని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ.. ప్రభుత్వం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎస్‌ఈసీ వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరపలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మరోవైపు.. హైకోర్టులో దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించిందని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వాదించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి అధికరణ 243కె ప్రకారం ఎన్నికల నిర్వహణ విషయంలో స్వచ్ఛందంగా అధికారాన్ని ఉపయోగించే వెసులుబాటు ఉందన్నారు. ఎన్నికల విషయంలో సహకారం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ దశలో ఎన్నికల ప్రక్రియను నిలిపేయలేమని తేల్చిచెప్పింది.
ఇదీ చదవండి:సన్నరకాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది: కేటీఆర్