సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన మీడియా వారితోపాటు ఇతరులపై నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారంటూ... టీవీ-5 న్యూస్ ఛానల్‌కు చెందిన బి.రాజగోపాల్ నాయుడు దాఖలు చేసిన పిల్‌పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తున్నారా, లేదా అన్నది చెప్పాలని.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్‌ను ఆదేశించింది. ప్రాథమిక విచారణ చేయకుండానే కేసులు నమోదు చేస్తున్నారని.. వ్యక్తులు ఎవరైనా రెండు, మూడు రోజులు కనిపించకపోతే ఆందోళనతో కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్న సందర్భాలు చూస్తున్నామని తెలిపింది. ఆ తర్వాతే నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్న విషయం తమ దృష్టిలో ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ కేసు నమోదైన 24 గంటల్లో వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ అప్లోడ్ అయితే.. దాని ఆధారంగా కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది.
కొన్ని పోస్టులు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి..
భావప్రకటన స్వేచ్ఛ ఉందనడంలో సందేహం లేదన్న ధర్మాసనం.. సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడింది. కొన్ని పోస్టులు దారుణంగా ఉంటున్నాయని.. సామాజిక మాధ్యమాల ద్వారా హైకోర్టు న్యాయమూర్తులపైనా దుష్పచారం చేసిన ఘటనపై కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించింది.
ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతోంది..
ప్రాథమిక విచారణ చేయకుండానే సీఐడీ నేరుగా కొన్ని తప్పుడు కేసులు నమోదు చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేశ్‌చంద్ర హైకోర్టుకు నివేదించారు. అగ్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా.. ఏడేళ్లలోపు జైలు శిక్ష విధించేందుకు వీలున్న కేసుల్లో కూడా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, ఎన్నింటిలో నిందితుల్ని రిమాండుకు పంపారు, కేసుల స్థితి ఏంటనే వివరాల్ని కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు. ఎఫ్ఐఆర్ దస్త్రాలను 24 గంటల్ వెబ్‌సైట్లో ఉంచడం లేదని.. దీనివల్ల ముందస్తు బెయిలు పొందే అవకాశం లేకుండా పోతోందన్నారు. ఈ చర్యతో నిందితుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయన్నారు.