బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని గత విచారణలో ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వ్యవహరించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 1,770 బ్లాక్‌ఫంగస్ కేసులున్నాయని కేంద్రం ఇటీవల కేటాయించిన ఇంజెక్షన్లు బాధితులకు ఏమాత్రమూ సరిపోవన్నారు. మూడోదశ పొంచి ఉన్నందున వైద్య సిబ్బంది సంఖ్యను తాత్కాలిక ప్రాతిపదికన పెంచేందుకు ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎస్‌జీపీ బదులిస్తూ.. 38వేల మంది అదనపు సిబ్బందిని నియమించామన్నారు. తాజా వివరాలతో మెమో దాఖలు చేస్తామన్నారు.