ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో ప్రభుత్వ పెద్దల ద్వారా తెలుసుకుని అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారంటూ కొందరు వ్యక్తులు, సంస్థలపై దాఖలైన కేసులో... మరోమారు వాదనలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తవగా... ముగ్గురు సెక్షన్ ఆఫీసర్ల వాంగ్మూలాల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చేందుకు విచారణ తిరిగి ప్రారంభించాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈమేరకు మంగళవారం విచారణ జరిగింది.
కేసును కొట్టివేయాలి...
ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు చట్ట విరుద్ధం ఎలా అవుతాయని... పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. విక్రయదారుడికి లేని అభ్యంతరం ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. రాజధానిపై బహిరంగంగా లభ్యమైన సమాచారం మేరకే పిటిషనర్లు భూములు కొన్నారని స్పష్టం చేశారు. దీని వెనుక కుట్ర, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. మరికొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కేఎస్.మూర్తి, ఏకె. కిశోర్‌రెడ్డి, ఎంవీ.సుబ్బారెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ ముందుగానే ఓ ఉద్దేశానికి వచ్చేసి, దర్యాప్తు ప్రక్రియను దుర్వినియోగం చేస్తోందన్నారు. సెక్షన్ ఆఫీసర్ల వాంగ్మూలాల్ని పరిగణించద్దని, కేసును కొట్టివేయాలని కోరారు.