AP High Court GO No 1: జీవో నంబర్ 1పై విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టగా.. సీజే ధర్మాసనం ఎదుట పిటిషనర్లు, ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. జీవో నం.1పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.
జీవో నం.1పై హైకోర్టులో రేపు కూడా కొనసాగనున్న వాదనలు రహదారులపై బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహణకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ -1ను ఈరోజు(జనవరి 23) వరకు సస్పెండ్ చేస్తూ.. ఈనెల 12వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
విచారణ ఇలా సాగింది: జీవో నెం 1 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా అని హైకోర్టు ప్రశ్నించింది. స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా అని ప్రశ్నలు సంధించింది. బ్రిటిష్ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే.. స్వాతంత్య్ర పోరాటం జరిగేదా అని హైకోర్టు నిలదీసింది. ఇదంతా చూస్తుంటే మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.