ప్రభుత్వ పవర్‌ను ప్రజలెప్పుడు పీకాలి AP HC on ganapati Granite Case : నలభై లక్షలకు పైగా బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ పరిశ్రమకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ అధికారుల చర్యపై గణపతి గ్రానైట్స్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం పరిశ్రమపై పలువురు ఆధారపడి జీవిస్తుంటారని, వారి జీవనాధారం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గత డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. విచారణను ఈనెల 3కు వాయిదా వేశారు.
గణపతి గ్రానైట్స్ తరఫు న్యాయవాది నాయుడు శివరామకృష్ణారెడ్డి జనవరి 3న జరిగిన విచారణలో వాదనలు వినిపిస్తూ.. విద్యుత్‌ను పునరుద్ధరించలేదన్నారు. కనీసం కోర్టు ఉత్తర్వులను అందుకోవడానికి అధికారులు నిరాకరించారని తెలిపారు. కోర్టును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలను పిటిషనర్ రికార్డు చేశారని వాటిని సీడీ రూపంలో కోర్టు ముందు ఉంచానన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈనెల 6న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఈలోపు ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన అధికారులకు అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో తప్పని సరి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో ఇంధనశాఖ ఎస్‌సీఎస్ కె.విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ జనార్దన్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ సయద్ అబ్దుల్ కరీం తదితరులు ఉన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో ఈఈ కరీం వివరణ ఇస్తూ.. తప్పుకు పాల్పడ్డానని అంగీకరించారు.
ఏం చేస్తారు..? :న్యాయమూర్తి స్పందిస్తూ.. తప్పు చేసినట్లు ఈఈ అంగీకరించినందున ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రత్యేక సీఎస్ విజయానంద్‌ను హైకోర్టు ప్రశ్నించింది. రికార్డులను పరిశీలిస్తానని ఎస్‌సీఎస్ బదులివ్వడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. తప్పును ఒప్పుకున్నాక ఇంకా రికార్డులను పరిశీలిస్తామనడం ఏంటని ప్రశ్నించారు. మీ పరిపాలన ఇలా ఉందికాబట్టే కింది స్థాయి అధికారుల తీరు అలా ఉందన్నారు. ‘మీశాఖలో ఏమి జరుగుతుందో మీకు తెలీదు. మీశాఖలో ప్రతీది ఫ్రాడ్ జరుగుతోంది. ఐఏఎస్ అధికారులు ఏసీ ఛాంబర్లలో కూర్చుంటే ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు. వాస్తవాలు తెలుసుకోవాలి’ అని తీవ్రంగా మండిపడ్డారు.
కోర్టునే మోసం చేస్తున్నారు..అధికారులు కోర్టును మోసం చేస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. ఓ వ్యవహారంలో ఈనెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావును ఆదేశించామని.. గుర్తు చేశారు. అనారోగ్యం కారణంగా మంచం దిగని స్థితిలో ఉన్నానని, కోర్టుకు రాలేకపోతున్నానని న్యాయవాది ద్వారా ఆయన కోర్టుకు తెలిపారు. నిజమోకాదో తెలుసుకునేందుకు సెల్ ఫోన్ ద్వారా స్పీకర్ ఆన్‌చేసి కోర్టు హాలు నుంచే సీఎండీకి ఫోన్ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను న్యాయముూర్తి కోరారు. ఈనెల 5వ తేదీన విధుల్లో ఉన్నారా? సెలవులో ఉన్నారా? తెలుసుకోవాలని కోరారు. ఎస్‌సీఎస్ బదులిస్తూ.. ఈనెల 5వ తేదీన ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు తనతోనే ఏలూరులో ఉన్నారని చెప్పారు. అధికారులు కోర్టును ఏవిధంగా వంచిస్తున్నారో ఇప్పుడైనా తెలిసిందా? అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోర్టుకు రావడానికి ఇబ్బందేంటి..? కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థల తరఫున న్యాయవాది వీఆర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వీఎల్ గణపతి గ్రానైట్స్ సంస్థ 43లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ప్రస్తుతం విద్యుత్‌ను పునరుద్ధరించిన బకాయిలు చెల్లించరేమోనని సందేహం వ్యక్తంచేశారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. ప్రభుత్వ న్యాయవాదులు తీరువల్లే అధికారులు తరచూ కోర్టుముందు నిలబడాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత కేసులో ఈఈ స్థాయి అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయం అని చెప్పారంటే దాని వెనుక ఎవరి సలహాలుంటాయో అర్థం చేసుకోగలమన్నారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంలో అధికారుల బాధ్యత ఎంతుందో.. మీ బాధ్యత అంతే ఉందని విద్యుత్ సంస్థల తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వీఆర్ రెడ్డిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. గ్రానైట్ పరిశ్రమ తప్పించుకుపోతుందోననే ఆందోళన అవసరం లేదన్నారు. గ్రానైట్ పరిశ్రమ 40లక్షల బకాయిలు చెల్లించకపోతేనే విద్యుత్ కనెన్షన్ తొలగించారు. వివిధ పనులు నిర్వహించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అంత బకాయిలున్న రాష్ట్రప్రభుత్వం పవర్‌ని ప్రజలెప్పుడు తీయాలి’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.