ఏపీ రాజధాని ప్రాంతంలోని ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపిన పోలీసుల తీరును ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు. వారిపై పెట్టిన మిగిలిన సెక్షన్లన్నీ బెయిలు ఇవ్వదగినవే. అలాంటప్పుడు నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారు. నిందితులను రిమాండుకు పంపే విషయమై నిబంధనలను పాటించడంలో న్యాయాధికారి కూడా విఫలమయ్యారు. నిందితులను యాంత్రికంగా రిమాండుకు పంపడానికి వీల్లేదు. ఈ వ్యవహారంపై డీజీపీ పర్యవేక్షణలో.. దర్యాప్తు అధికారి/మంగళగిరి డీఎస్పీ, గుంటూరు గ్రామీణ ఎస్పీ రెండు వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలి. నిందితులను రిమాండుకు పంపిన మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, బెయిలు పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు నాలుగో అదనపు సెషన్స్ ప్రత్యేక జడ్జి కూడా నివేదికలు సమర్పించాలి’’ అని ఆదేశించింది. రాజధాని రైతులు ఏడుగురికీ బెయిలు మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మూడు రాజధానులకు అనుకూలంగా గత నెల 23న తాళ్లాయపాలెం వెళ్తున్నవారిపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించారనే ఆరోపణతో రాజధాని ప్రాంత రైతులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. నిందితుల బెయిల్ పిటిషన్‌ను గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల కొట్టేసింది. రైతులు కుక్కమళ్ల అమర్‌బాబు, నంబూరు రామారావు, ఈపూరి రవికాంత్, ఈపూరి సందీప్ మరియదాసు, ఈపూరి కిశోర్, సొంటి నరేశ్, దానబోయిన బాజీ హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ‘ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడానికి వీల్లేదు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఐదుగురు ఎస్సీలు. అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్ తప్ప మిగిలినవన్నీ బెయిలు ఇవ్వదగినవే. తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారు ఫిర్యాదులో పేర్కొనలేదు. కులదూషణ జరగలేదని ఆయనే చెబుతున్నారు. బెయిలు పిటిషన్‌పై విచారణ చేసిన గుంటూరు కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు’ అని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ ప్రమాణపత్రాన్ని గుంటూరు కోర్టు పరిగణలోకి తీసుకోలేదా? అని ప్రశ్నించగా.. లేదని న్యాయవాది బదులిచ్చారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని బెయిల్ పిటిషన్ను కొట్టేశారన్నారు.