యురేనియం గనుల తవ్వకాల్ని విస్తరించేందుకు అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ ప్రతులను పరిశీలించి తదుపరి విచారణ ఈనెల 11 కు వాయిదా వేసింది. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. స్టేను ఎత్తివేయాలని యూసీఐఎల్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగేందుకు అనుమతివ్వాలని కోరారు.
యురేనియం కార్పొరేషన్ పిల్‌పై విచారణ ఈనెల 11కు వాయిదా
యురేనియం గనుల తవ్వకాల విషయంలో అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను ఎత్తివేయాలని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది ధర్మాసనం.
పిటిషనర్ తరపు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ .. పర్యావరణ శాఖ గతంలో విధించిన షరతులను యూసీఐఎల్ పట్టించుకోలేదన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యురేనియం ఖనిజ తవ్వకాల విస్తరణకు అనుమతివ్వడం సరికాదన్నారు. చట్ట నిబంధనలను పాటించకుండా అభిప్రాయ సేకరణ సరికాదన్నారు. స్టే ఎత్తివేతను వ్యతిరేకించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులు వేసిన కౌంటర్ ప్రతులు తమ ముందున్న ఫైల్లోకి చేరలేదని తెలిపింది. వాటిని వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11 కు వాయిదా వేసింది.