తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 8:37 AM IST

ETV Bharat / state

''రుయా' ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించండి'

కరోనా బాధితుల మరణానికి కారణమైన తిరుపతి రుయా ఆసుపత్రి యాజమాన్యం, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న సీఎస్​తో పాటు ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.

ap-hc-on-ruya-incident
'రుయా' ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించండి

కరోనా బాధితుల మరణానికి కారణమైన ఘటనలో ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి రుయా ఆసుపత్రి యాజమాన్యం, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

ఈనెల 10న రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు కన్నుమూశారని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, ఆసుపత్రి యాజమాన్యపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ స్పోర్ట్స్‌ అథార్టీ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత పవార్‌ మోహన్‌రావు హైకోర్టులో పిల్‌ వేశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఈనెల 12న అలిపిరి ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ... ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతోనే రుయాలో మరణాలు సంభవించాయన్నారు. 36 మందికి పైగా రోగులు చనిపోతే ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమేనని చెబుతోందన్నారు. వాస్తవాలను తేల్చేందుకు జిల్లా జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.

ఆసుపత్రికి దగ్గర్లో ఆక్సిజన్‌ ప్లాంటు ఉన్నా... అధికారుల్లో సమన్వయ లోపంతోనే దారుణ ఘటన చోటుచేసుకుందన్నారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అయిదు ఆక్సిజన్‌ ప్లాంట్లను కేటాయించగా... ఇంతవరకు ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకురాలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఇదీచదవండి:కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత.. దిక్కుతోచని స్థితిలో పిల్లలు

ABOUT THE AUTHOR

...view details