తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాయలసీమ ఎత్తిపోతల పర్యటనను రద్దు చేసుకోండి'

కృష్ణా బోర్డు కార్యదర్శి (మెంబర్‌ సెక్రటరీ)కి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదివారం లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు కృష్ణా బోర్డు నియమించిన కమిటీ చేపట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు.

ap-govt-letter-to-krishna-board-over-rayalaseema-upliftment-project-issue
'రాయలసీమ ఎత్తిపోతల పర్యటనను రద్దు చేసుకోండి'

By

Published : Apr 19, 2021, 10:43 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు కృష్ణా బోర్డు నియమించిన కమిటీ చేపట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మరోసారి విన్నవించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి (మెంబర్‌ సెక్రటరీ)కి రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు ఆదివారం లేఖ రాశారు. ఇప్పటికే ఈ విషయంలో లేఖల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను కాదని.. సోమ, మంగళవారాల్లో తాము నియమించిన కమిటీ సీమ ఎత్తిపోతల సందర్శనకు వస్తుందని బోర్డు కార్యదర్శి మళ్లీ తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి స్పందించింది.

తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను కూడా సందర్శించాలని, రెండు రాష్ట్రాలు సమ్మతించిన సభ్యులు మాత్రమే ఈ కమిటీలో ఉండాలని, వీటిపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించిన తర్వాతే నిపుణుల కమిటీ సందర్శన ఉండాలని ఇంతకుముందే తెలియజేశామని శ్యామలరావు ప్రస్తావించారు. ఈ కమిటీలోని సభ్యుల నిష్పాక్షికతపై తమకు సందేహం ఉందని కూడా తెలియజేశామని గుర్తు చేశారు. పైగా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, రాయలసీమ ఎత్తిపోతల పథకం సీఈ, ఎస్‌ఈలకూ కరోనా సోకిందని వివరించారు. ఈ పరిస్థితుల్లో నిపుణుల కమిటీ సీమ ఎత్తిపోతల సందర్శన సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావించిన అంశాలన్నీ బోర్డు సమావేశంలో చర్చించే వరకు, కరోనా తీవ్రత తగ్గే వరకు కమిటీ పర్యటనను రద్దు చేసుకోవాలని శ్యామలరావు కృష్ణా బోర్డు కార్యదర్శిని కోరారు.

ఇదీ చదవండి:అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు

ABOUT THE AUTHOR

...view details