రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలతో పాటు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రై పాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. విశాఖ మధురవాడలో 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం అదానీ ఎంటర్ ప్రైజెస్‌కు 130 ఎకరాలు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో జయ లక్ష్మీనరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు 17.49 ఎకరాలు, కొత్తవలసలో శ్రీశారదా పీఠానికి 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్‌లకు కేబినెట్ ఓకే చెప్పింది.
రాష్ట్రంలో 5 చోట్ల ఏడు నక్షత్రాల పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి, విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చేనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. వైద్య విద్య, కుటుంబ సంక్షేమశాఖలో కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం ఓకే చెప్పింది. కొత్తగా 1,285 ఉద్యోగాలు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టులు, విద్య కళాశాలల్లో 2,190 పోస్టులతో పాటు మొత్తంగా 4,035 కొత్త ఉద్యోగాలకు కేబినేట్ అనుమతి ఇచ్చింది. 2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం జూన్‌లో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తించేలా ప్రచారం చేయాలని... 2021 నవంబర్ 8 నుంచి 2002 ఏప్రిల్ 30 వరకు మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని కేబినెట్ స్పష్టం చేశారు.
కొత్తగా 4 వేల ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు కేబినెట్లో తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు
- వివిధ పథకాల్లో అనర్హులుగా ఉన్న వ్యక్తుల అర్జీల పరిశీలన
- జూన్, డిసెంబర్‌లో అర్హులకు పథకాలు ఇచ్చేందుకు అంగీకారం
- పాల నాణ్యత తనిఖీని పశుసంవర్ధక శాఖకు మారుస్తూ ఆమోదం
- మావోయిస్టులు, అనుబంధ సంస్థలు మరో ఏడాది నిషేధంపై ఆమోదం
- తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కొత్త అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు
- నూజివీడులో కేంద్రీయ వర్సిటీ ఏర్పాటుకు 7 ఎకరాల భూమి కేటాయింపు
- విజయనగరంలో జేఎన్టీయూ కాకినాడ-గురజాడ వర్సిటీ
- ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఇదీ చదవండి :Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు