ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం తిరిగి ఆయనను నియమించకుండా అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే అవేమీ ఫలించలేదు. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించమంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. రమేష్ కుమార్‌ను తిరిగి నియమించే ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
కరోనా వ్యాప్తి కారణంగా.. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదవి నుంచి తొలగించింది దీనిపై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం.. హైకోర్టు ఆర్డినెన్సును రద్దు చేసి.. రమేష్ కుమార్ ని తిరిగి నిర్మించాలని చెప్పడం.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకి వెళ్లడం.. అక్కడ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించడం జరిగాయి. తమ తీర్పు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణిస్తూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రమేష్ కుమార్‌ను గవర్నర్‌ని కలవాల్సిందిగా సూచించింది. కోర్టు సూచనలతో రమేష్ కుమార్ గవర్నర్‌ని కలిసిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి.
*వివాదం మొదలైంది ఇక్కడే..!*
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ మార్చి 15న ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఎస్ఈసీగా ఉన్న రమేశ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో తమకు తెలుసంటూ... ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా చేశారు.
*పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్..!*
నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్‌ఈసీ పదవి నుంచి తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రయోగించింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్‌ఈసీ పదవికి అర్హులని పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసినవారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్, నోటిఫికేషన్ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.
*ప్రత్యేక ఆర్డినెన్సు*
ఎస్‌ఈసీ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకచకా జరిగిపోయాయి. ఇక కొత్త ఎస్ఈసీగా పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ పేరును సూచిస్తూ... గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వెంటనే ఆయన ఆమోదముద్ర వేశారు.
*కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ*
ఎస్‌ఈసీ పదవి నుంచి తనని తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని పిటిషన్లో పేర్కొన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఎస్‌ఈసీ పదవీ కాలంపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు హైకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని అఫిడవిట్లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ప్రస్తావించారు.
ఎస్‌ఈసీ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టులో వాదించింది. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్ వి.కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చట్ట నిబంధనలకు లోబడి ఉందన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు.నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్, పి.వీరారెడ్డి ప్రతి సమాధానంగా(రిప్లై) వాదనలు వినిపించారు. ''ఆర్డినెన్స్ తీసుకొచ్చే అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తన చర్యను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడం కోసమే ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. ఆర్డినెన్స్, తదనంతర జీవోలను రద్దు చేయాలని'' కోరారు.