తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్‌ఫ్రాటెక్ (ప్రైవేట్) సంస్థకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది.
'ఆ సంస్థ (అమరరాజా ఇన్‌ఫ్రాటెక్) భూములు తీసుకుని పదేళ్లవుతున్నా... ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకు రాలేదు. 253.6 ఎకరాలు ఖాళీగా ఉంచేసింది. ఆ భూముల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్‌ఈజెడ్)ని ఏర్పాటు చేస్తామని, డిజిటల్ వరల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. 4,310 మందికి మాత్రమే ఉపాధి కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమి విలువ రూ.60 కోట్లకుపైగా ఉంటుంది. ఆ సంస్థ అంత విలువైన ప్రజల ఆస్తిని ఖాళీగా వదిలేయడం ఒప్పందంలో చేసుకున్న నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రయోజనాలకూ విరుద్ధం. నిబంధనల ప్రకారం కంపెనీ ఏ అవసరం కోసం తీసుకుంటే అందుకు రెండేళ్లలోగా ఆ భూముల్ని వినియోగించాలి. లేనిపక్షంలో ఏపీ ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకోవచ్చు' అని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భూముల కేటాయింపు జరిగిందిలా..
తిరుపతి సమీపంలోని కరకంబాడి వద్ద అమరరాజా బ్యాటరీస్‌కు అతిపెద్ద బ్యాటరీ ప్లాంటు ఉంది. దీనికి అనుబంధంగా కంపెనీ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు స్వగ్రామం పేటమిట్టతో పాటు ఆయన సతీమణి గల్లా అరుణ కుమారి స్వగ్రామం దిగువమాఘంలో మహిళల కోసం ప్రత్యేకంగా మరో కంపెనీ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గల్లా రామచంద్ర నాయుడుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ కార్యక్రమంలో సూచించారు. భూముల సేకరణ, ఖరీదు దృష్ట్యా విస్తరణ అంత సులభం కాదనే అభిప్రాయం వైఎస్ వద్ద ఆయన వ్యక్తం చేశారు. జిల్లాలో కోరుకున్న చోట భూములు కేటాయిస్తామంటూ చిత్తూరు సమీపంలో సీఎంసీ ఆసుపత్రికి కేటాయించిన భూములను మొదట ప్రతిపాదించారు. చదునైన వ్యవసాయ భూములు తీసుకోవడం భావ్యం కాదనే అభిప్రాయంతో యాదమరి, బంగారుపాళ్యం మండలాల సరిహద్దులోని నూనెగుండ్లపల్లె సమీపంలో కొండ ప్రాంతాలను ఎంచుకున్నారు. ఇక్కడి భూములు కేటాయింపునకు వైఎస్ చొరవ తీసుకుని అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి గీతారెడ్డికి సూచనలు చేసి సజావుగా కేటాయింపు ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అటు ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీకి... ఇటు రైతులకు వేర్వేరుగా డబ్బులు చెల్లించి కంపెనీ భూములను స్వాధీనం చేసుకుంది.
అమరరాజా గ్రోత్ కారిడార్ ఏర్పాటు
ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరాల చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి అమరరాజా గ్రోత్ కారిడార్ పేరిట ప్రత్యేక ఆర్థిక మండలిని (ఎస్‌ఈజెడ్), గ్రీన్‌జోన్‌ను సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో రూ.700 కోట్లు వెచ్చించి ఆటోమోటివ్ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పింది. ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65 లక్షల యూనిట్లు. దశల వారీగా ప్లాంట్‌ను విస్తరించడం ద్వారా ఉత్పత్తిని 1.08 కోట్ల యూనిట్లకు చేర్చి దేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కంపెనీ విస్తరణ పనులు చేపట్టింది.