Ap Corporation Debts: ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పులు మొత్తం బయటపడకుండా ప్రభుత్వం తిప్పలు పడుతోంది. కార్పొరేషన్ల పేరుతో లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకోవడంతో.. కాగ్ ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు ప్రత్యేక ఆడిట్‌కు అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యలయంలోనే నలుగురు అధికారులు ఉండి ఆడిట్ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
తామేదో ప్రత్యేక పనిమీద వచ్చామన్న విషయాన్ని ఎక్కడా చెప్పకుండా తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ ఆడిట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కంగారు పడుతున్నారు. అంతకుముందు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ ఆకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అప్పుల లెక్కలపై వారితో ఘర్షణ వైఖరితో వ్యవహరించినట్లు తెలిసింది.
తమ గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని వాదన: రాష్ట్రం ఇచ్చిన లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు ఏవో తప్పులు జరుగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఉన్నతస్థాయి నుంచి తామేదో అప్పుల విషయంలో తప్పులు చేసినట్లుగా లేఖలు వస్తున్నాయని తమ గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని వాదనకు దిగినట్లు తెలిసింది. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు సదరు రాష్ట్ర అధికారులకు ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్ల అప్పులపై ఇప్పటికే ఓ నోట్ సిద్ధం: ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆడిట్‌లో అసలు అప్పులు బయటపడితే కష్టమేనని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంగారు పడుతున్నారు. కార్పొరేషన్ల అప్పులపై ఇప్పటికే ప్రభుత్వం ఓ నోట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం కార్పొరేషన్ల రుణభారం రూ.40వేల కోట్లే ఉందని అంతకుమించి లేదని నమ్మబలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా ఆర్థికశాఖ వెల్లడించే కార్పొరేషన్ అప్పుల జాబితానే ఆర్థికశాఖలోని మధ్యస్థాయి అధికారులందరికీ అందజేసి ఎవరేం అడిగినా ఇవే గణాంకాలు చెప్పాలని నిర్దేశించడం విశేషం.