ఏపీ ప్రభుత్వానికి అమరావతిపై ఎందుకంత అక్కసు?.. అప్పుడు రాజధాని.. ఇప్పుడు స్మార్ట్ సిటీ AP Govt Neglects Amaravati Smart City: కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక చేసిన ఆకర్షణీయ నగరాల్లో అమరావతి ఒకటి. రాజధానిగా ఉన్న అమరావతితో పాటు తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాల్ని అప్పట్లో స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశారు. నగరాల్లో మౌలికవసతుల్ని అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే స్మార్ట్ సిటీ ఏర్పాటు లక్ష్యం.
గత ప్రభుత్వ హయాంలో అమరావతి స్మార్ట్ సిటీలో రూ.2 వేల 46 కోట్లతో 21 ప్రాజెక్టులను చేపట్టారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ. 560 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక.. మూడున్నరేళ్లలో 100 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. స్మార్ట్ సిటీ కోటా కింద ఎంపికైన నగరాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చెరో రూ.100 కోట్లు కేటాయించాలి.
Govt Neglects Amaravati Smart City: కేంద్రం తన వాటాను ఎప్పటికప్పుడు కేటాయిస్తూ వస్తున్నా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్ర కోటా ఇవ్వడం మానేయడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పనుల్లోనూ కోత పెట్టింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. స్మార్ట్ సిటీ నిధుల వినియోగానికి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ ఏడాది జూన్‌తో ముగుస్తుంది. 4 నెలల సమయం మాత్రమే ఉండటంతో, గడువులోపు అవి పూర్తవుతాయా అనేది అనుమానంగానే కనిపిస్తోంది.
"గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు తప్పితే స్మార్ట్ సిటీ కింద కొత్తగా చేసిందేమీ లేదు. అప్పటి పనులనూ పూర్తి చేయడం లేదు. చాలాచోట్ల విలువైన నిర్మాణ సామగ్రి దొంగలపాలవుతోంది. రోడ్లు కూడా తవ్వుకుపోతున్నారు"-వరలక్ష్మి, రాజధాని రైతు
అమరావతి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈ దుస్థితికి కారణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి స్మార్ట్ సిటీకి సంబంధించి 21 పనుల్లో వైసీపీ ప్రభుత్వం పదింటిని వెనక్కి తీసుకుంది. కేవలం రూ.1000 కోట్ల పనులకే పరిమితం కావాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటివరకూ పూర్తయిన పనులకు సీఆర్డీఏకి సుమారు రూ.570 కోట్లు విడుదల చేసింది. మరో 87 కోట్ల వరకూ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది.
స్మార్ట్ సిటీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించకుండా కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతా తెరిచి, అందులో నిధులు జమ చేయాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. తమ వాటా నిధులు రూ.223 కోట్లు జమచేయకుండా కాలయాపన చేస్తోంది. దీంతో బిల్లులు నిలిచిపోగా.. మిగతా పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడంలేదు.
స్మార్ట్ సిటీ పరిధిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టే ప్రాంతాల్లో విలువైన పైపులు, నిర్మాణ సామగ్రి వృథాగా పడి పాడైపోతున్నాయి. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పురోగతిపై సీఎం జగన్ కనీసం సమీక్ష కూడా చేయట్లేదు. గతంలో 75 శాతానికిపైగా పూర్తయిన పనులను మాత్రమే కొద్దికొద్దిగా పూర్తి చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మితోపాటు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఇటీవల వాటిని పరిశీలించారు. మిగతా పనులపై మాత్రం వారు నోరు మెదపలేదు.
ఇవీ చదవండి :