విధాన నిర్ణయాలు, బదిలీలు, నిధుల కేటాయింపులు, వ్యయాలు తదితర పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఉత్తర్వుల్ని ‘జీవోఐఆర్’ వెబ్సైట్లో ఉంచే విధానానికి స్వస్తి పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దానిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడం, కోర్టులో వ్యాజ్యాలు దాఖలవడంతో ఇప్పుడు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. గెజిట్ నోటిఫికేషన్లు ప్రచురిస్తున్న ఏపీ ఈ-గెజిట్ వెబ్సైట్లోనే ఇకపై జీవోలూ ఉంచుతామని పేర్కొంది. కానీ ఇదివరకటిలా జీవోలన్నీ ఈ-గెజిట్‌లో ఉంచబోమని, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనుకున్నవాటినే అప్లోడ్ చేస్తామని పేర్కొంది. వాటిలో అత్యవసరమనుకున్నవి వాటి ప్రాధాన్యాన్ని బట్టి, సాధారణ జీవోల్ని వారానికి ఒకసారి మాత్రమే ఈ-గెజిట్‌లో ఉంచుతామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నం.100) జారీ చేశారు. ఈ జీవోను కూడా ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టకపోవడం గమనార్హం. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని కోర్టుకు చెప్పేందుకే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని వివిధ వర్గాలవారు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఏ జీవో అవసరమో, ఏది కాదో అధికారులు ఎలా నిర్ణయిస్తారని.. ఒకసారి జీవో ఇచ్చాక అది ‘పబ్లిక్ డాక్యుమెంట్’ అవుతుందని, బయట పెట్టాలా వద్దా అన్న విచక్షణాధికారం అధికారులకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
డిజిటల్ సంతకం లేదని..!
- జీవోఐఆర్ వెబ్సైట్లో జీవోలు ఉంచే విధానాన్ని రద్దు చేయడం, ఇప్పుడు ఈ-గెజిట్ వెబ్సైట్లో ఎంపిక చేసిన జీవోల్ని మాత్రమే ఉంచాలని నిర్ణయించుకోవడానికి కారణాలేంటో ప్రభుత్వం జీవో నంబర్ 100లో వివరించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఆఫీస్ మాన్యువల్, ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సమాచార హక్కు, ఐటీ, ఇతర చట్ట నిబంధనలకు లోబడి, సమాచారం తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును నెరవేర్చేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించాలనే జీవోఐఆర్ వెబ్సైట్లో జీవోలు ఉంచే విధానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.
- ‘జీవోఐఆర్ వెబ్సైట్లో ఇది వరకు ఉంచే జీవోలపై అధికారుల సంతకం లేదా డిజిటల్ సంతకం ఉండేవి కాదు. అధికారిక గెజిట్ చట్టబద్ధమైన డాక్యుమెంట్ కాబట్టి, ఇకపై జీవోల్ని ఏపీ ఈ-గెజిట్ వెబ్సైట్లో మాత్రమే అప్లోడ్ చేయాలని నిర్ణయించాం’ అని పేర్కొంది. విస్తృత చర్చలు, పరిశోధన, కేంద్రం, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
- ‘ఇంటర్నెట్ సహా వివిధ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు సులువుగా తెలిసేలా, విస్తృతంగా వ్యాపించేలా అందుబాటులో ఉంచాలన్నది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(2) 4(3)ల ఉద్దేశం. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రజలకు సమాచారం అందించే ఏకైక వేదికగా ఏపీ ఈ-గెజిట్ ఉంటుంది’ అని తెలిపింది.
- ప్రజలకు తెలియక్కర్లేని, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఉత్తర్వుల్ని ఈ-గెజిట్‌లో ఉంచబోమని, నేరుగా సంబంధిత అధికారులకే పంపిస్తామని తెలిపింది. వ్యక్తిగత గోప్యత ప్రతి వ్యక్తికీ ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఈ నిబంధన పెట్టామని పేర్కొంది. ఈ-గెజిట్‌లో ఉంచని ఉత్తర్వుల్ని సమాచార హక్కు చట్టం నిబంధనలకు లోబడి పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడించింది.
- ప్రజలకు సమాచారం మరింత మెరుగ్గా అందేలా చూసేందుకు, కావలసిన ఉత్తర్వుల్ని తేలిగ్గా వెతికి పట్టుకునేందుకు, మితిమీరిన సమాచార ఉరవడిని నియంత్రించేందుకు, ఉత్తర్వుల సమర్థ వర్గీకరణకు వీలు కల్పించేందుకు.. చిన్న చిన్న వ్యయాలకు సంబంధించిన, ప్రజాప్రయోజనం లేదనుకున్న జీవోల్ని ఆన్లైన్లో ఉంచబోమని తెలిపింది. ఉదాహరణకు వైద్య ఖర్చుల రీయంబర్స్మెంట్, మెడికల్ లీవ్‌లు, ప్రభుత్వ వాహనాల డీజిలు ఖర్చులు, స్టేషనరీ కొనుగోళ్లు, ఎల్టీసీ, ఆర్జిత సెలవులు వంటి జీవోల్ని ఆన్లైన్లో ఉంచబోమని స్పష్టం చేసింది.
- సెక్రటేరియేట్ ఆఫీస్ మాన్యువల్‌లో అత్యంత రహస్యం, రహస్యం, గోప్యమైనవిగా వర్గీకరించిన జీవోల్ని ఆన్లైన్లో ఉంచబోమని వెల్లడించింది.
జీవో ఇచ్చేశాక విచక్షణేంటి?
ప్రభుత్వ నిర్ణయాల్లో వివాదాస్పదమైనవి, ప్రజలకు తెలిస్తే విమర్శలు వస్తాయనుకున్నవాటిని ‘విచక్షణ’ పేరుతో బహిరంగపరచకుండా ఉంచేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏదైనా అంశం ప్రభుత్వ పరిశీలనలోనో, చర్చల దశలోనో ఉన్నప్పుడు బయటకు పొక్కితే ఇబ్బంది అనుకోవచ్చు. నిర్ణయం తీసేసుకుని, జీవో కూడా ఇచ్చేశాక ఇంకా గోప్యత, విచక్షణాధికారం ఏంటి?’ అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 2008 నుంచి ప్రభుత్వం ప్రతి జీవోనూ జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది.