ఏపీ అప్పుల ఊబిలోకి వెళ్తున్నా.. రుణాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్(ఎస్డీసీ) ద్వారా మరో మూడు వేల కోట్ల రూపాయలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి రుణంగా తీసుకోనున్నారు. ఇప్పటికే రూ. 10 వేల కోట్లను ఎస్డీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణ సమీకరణ చేసింది.
ఆర్థిక శాఖ ఆందోళన..
మొత్తంగా రూ. 25 వేల మేర ఆర్థిక వనరుల్ని సమీకరించటం లక్ష్యంగా ఎస్డీసీ ఏర్పాటైంది. అవసరమైనంత మేర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఈ కార్పొరేషన్‌కు ఎస్బీఐ ఇప్పటికే రూ. 6 వేల కోట్ల రుణాన్ని ఇచ్చింది. అలాగే మరో రూ. 4 వేల కోట్ల రుణాన్ని కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు సమకూర్చాయి. ఇప్పుడు తాజాగా మరో రూ. 3 వేల కోట్లను ఎస్బీఐ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ సంస్థ ఏర్పాటైన ఏడాదిలోపే ఇన్ని వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవటంపై ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది.