మన సెల్‌ఫోన్‌కు వచ్చే ఏవేవో లింకులను మనకు తెలియకుండానే క్లిక్ చేసేస్తుంటాం.. వివిధ రకాల మోసపూరిత యాప్‌లను అసంకల్పితంగా డౌన్‌లోడ్ చేసేస్తుంటాం.. ఫలితంగా వాటి మాటున దాగున్న సైబర్ నేరాల ముప్పును తెలిసీ తెలియక ఆహ్వానిస్తుంటాం. ఎప్పుడో ఒకప్పుడు నేరం బారిన పడి బాధితులుగా మారిన తర్వాత ఈ సమస్య ఎక్కడ తలెత్తిందని గుర్తించే ప్రయత్నం చేస్తాం. అదే ఎప్పటికప్పుడు మన సెల్‌ఫోన్‌లోకి మాల్‌వేర్ ఏమైనా ప్రవేశించిందా? హ్యాక్ అయిందా? అనేది తెలుసుకుంటూ.. వాటిని తొలగించుకోగలిగితే చాలావరకూ సైబర్ నేరాల బారిన పడే అవకాశం తగ్గుతుందని ఏపీ పోలీసులు చెబుతున్నారు.
డివైస్‌లు అమరిస్తే చాలు..
అందుకోసం త్వరలో ఏపీ వ్యాప్తంగా సైబర్ కియోస్కులను ఏర్పాటు చేయనున్నారు. వాటికి మన సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, మెమరీ కార్డు, ఇతర డివైస్‌లను అమర్చితే చాలు.. నిమిషాల వ్యవధిలో అందులోని మాల్‌వేర్స్, సైబర్ నేరాల ముప్పు కలిగించే ఇతరత్రా హాని కారకాల్ని తొలగించి శుభ్రం చేస్తాయి.