తెలంగాణ

telangana

ETV Bharat / state

RUYA incident: రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ కౌంటర్‌ - ap news

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఏపీ హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్‌ వేసింది.

ruya
ruya

By

Published : Aug 7, 2021, 1:45 PM IST

తిరుపతి రుయా (RUYA incident) ఆస్పత్రి ఘటనపై ఏపీ హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఆక్సిజన్‌ రావడంలో జాప్యంతోనే 23 మంది చనిపోయినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. ఆక్సిజన్‌ సరఫరా కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు అఫిడవిట్‌లో తెలిపింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక మృతిచెందిన ఘటనపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తెదేపా దివంగత నేత టీఆర్‌ మోహన్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఇదీ జరిగింది..

మే10న తిరుపతి రుయా (RUYA incident) ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రాణవాయువు అందక 23 మంది కరోనా రోగుల మృత్యువాత పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకు ఖాళీ అయింది. వార్డుల్లోని రోగులకు ప్రాణవాయువు సరఫరా ఆగిపోయి, పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. బాధితుల సహాయకులు వైద్యులకు సమాచారమిచ్చారు. ఆలోపు ఆస్పత్రి ఆవరణలో ఉన్న బంధువులు తమవారి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే రోగులు ఒకొక్కరుగా మరణించసాగారు. రాత్రి 9 గంటల సమయానికి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరాను పునరుద్ధరించారు.

ఈలోపే.. వార్డుల్లో గందరగోళం, సహాయకుల ఆగ్రహావేశాలతో.. వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. సుమారు 30 నిమిషాల వరకు ఆక్సిజన్ సరఫరా నామమాత్రంగానే జరిగిందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. ఆ తర్వాత ఆక్సిజన్ సరఫరా అయినా.. అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 8 గంటలకు ఘటన జరగ్గా.. పదిన్నర గంటల సమయంలో అధికారులు అక్కడికి వచ్చారు.

ప్రాణ వాయువు సరఫరా కోసం తమిళనాడులోని శ్రీపెరంబదూరుకు చెందిన లిండే సంస్థతో మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్యాంకుల్లో ఆక్సిజన్ స్థాయి 50 శాతం తగ్గిన వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం నేరుగా వారికి చేరిపోతుంది. అందుకు అనుగుణంగా ఆక్సిజన్ ట్యాంకర్ వస్తుంది. శ్రీపెరంబదూరు నుంచి తిరుపతి దాదాపు 130 కిలోమీటర్ల దూరం కాగా.. నిబంధనల మేరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడున్నర గంటల్లో ఆక్సిజన్ ట్యాంక్ చేరుకోగలదు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకే ట్యాంకర్ చేరుకోవాల్సి ఉన్నా.. అలా జరగలేదు. అదే విషాదానికి కారణమైంది. ఈ విషయమై.. రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

ఇదీ చూడండి:'ఆక్సిజన్ అందక చనిపోయారా? ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమా?'

ABOUT THE AUTHOR

...view details