తెలంగాణ

telangana

ETV Bharat / state

AP PRC : ఏపీలో ఉద్యోగులకు సంక్రాంతి కానుక... పీఆర్సీ ఎంతంటే..? - పీఆర్సీ వార్తలు

Govt Announce PrC
Govt Announce PrC

By

Published : Jan 7, 2022, 4:49 PM IST

Updated : Jan 7, 2022, 7:35 PM IST

16:45 January 07

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం

AP PRC : ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్‌ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

మంచి చేయాలనే తపనతోనే: సీఎం జగన్

CM Jagan On PRC: మంచి చేయాలనే తపనతోనే ప్రతి అడుగూ వేస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. కొవిడ్‌, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆదాయం తగ్గిందన్న ఆయన.. అన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫిట్‌మెంట్‌ 14.29 శాతం కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పిందని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సజావుగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపడుతామని.. ఈ విషయంలో కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తామన్నారు.

"ఫిట్‌మెంట్‌ 14.29 శాతం కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పింది. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి సజావుగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఉంది. కొవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపడుతాం. కారుణ్య నియామకాలకు కట్టుబడి ఉన్నాం.. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగులకు 2 వారాల్లోనే హెల్త్‌ కార్డుల సమస్యకు పరిష్కారం ఉంటుంది. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌ చేస్తుంది. ఇంటి స్థలం లేని ఉద్యోగులు ఉండకూడదు" - ముఖ్యమంత్రి జగన్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30లోపు ప్రొబేషనరీ, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో 10శాతం ఉద్యోగులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు జనవరి జీతంతోనే కలిపి ఇస్తామన్నారు.

సీఎం జగన్​ చెప్పిన ముఖ్యాంశాలు

  1. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు. 1- 1-2022 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
  2. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30లోపు ప్రొబేషనరీ, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తాం. సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశించాం.
  3. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు జూన్‌ 30లోపు పూర్తి చేస్తాం.
  4. 2020 ఏప్రిల్‌ నుంచే మానిటరీ బెన్‌ఫిట్‌.
  5. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం రిబేటుతో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఇళ్లు కేటాయింపు. 10 శాతం ప్లాట్లు ఉద్యోగులకు రిజర్వ్‌ చేస్తాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది.
  6. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాం.
  7. పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని స్పష్టంగా చెప్పినమీదట, పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాం.
  8. సీపీఎస్‌కు సంబంధించి టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌ సబ్‌కమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అని సీఎం వెల్లడించారు.
  9. కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి జీతాలతోనే అమలు చేయాలని నిర్ణయించాం.
  10. ఉద్యోగుల హెల్త్‌ కార్డుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరిస్తాం.

సర్వీసు పెంపుతో అదనపు లబ్ధి: సజ్జల

'జగన్‌ వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా వచ్చి ఊహించని రీతిలో ఆదాయం కోల్పోయాం. కరోనా కష్టాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇచ్చిన హామీల అమల్లో జగన్ ముందువరుసలో ఉంటారు. అత్యుత్తమ పీఆర్‌సీ అమలుచేసిన సీఎంగా జగన్ నిలిచిపోతారు. ఎవరూ అడగకున్నా ఉద్యోగ విరమణ వయసు పెంచారు. సర్వీసు పెంపుతో ఉద్యోగులకు అదనపు లబ్ధి ఉంటుంది. పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలనూ జగన్ నెరవేర్చారు"

- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం జగన్..

CM Jagan On PRC: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్‌సీ పై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఇదీ చూడండి:Bhadradri: వైభవంగా అధ్యయనోత్సవాలు.. ఐదోరోజు వామనావతారంలో స్వామివారు

Last Updated : Jan 7, 2022, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details