కరోనా వ్యాప్తి కారణంగా ఆదాయాలు బాగా దెబ్బతినడంతో కేంద్రం ఇప్పటికే కొన్ని వెసులుబాట్లు కల్పించింది. గతంలో జీఎస్‌డీపీలో ఏటా 3శాతం మాత్రమే మార్కెట్ రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టి 5శాతం వరకూ పెంచారు. దీంతో మరిన్ని అప్పులకు అవకాశం ఏర్పడింది.
గత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.2,91,345 కోట్లకు రుణభారం పెరుగుతుందని బడ్జెట్ సమయంలో ఏపీ సర్కారు అంచనా వేసింది. అందుకు భిన్నంగా అది రూ.3,02,202.70 కోట్లకు చేరుకుంది.
- 2019-20లో మొత్తం రూ.44,692.83 కోట్ల రుణం తీసుకున్నారు. ఈసారి రూ.46,795 కోట్ల రుణాలు తీసుకుంటామని తెలిపారు.
- ఏపీ రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గుతున్నా సంక్షేమం, ఇతర అంశాలపై ఖర్చు పెరిగింది. కరోనా వల్ల ఆర్థిక అంచనా కష్టమైంది. దీంతో రుణాలపైనే ప్రభుత్వం ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎప్పుడూ లేనంత...
జీఎస్‌డీపీలో రుణాల వాటా పెద్ద మొత్తంలో (34.55శాతం) పెరిగింది. అంతకుముందు రుణాల భారం కొద్ది కొద్దిగా పెరుగుతూ, తగ్గుతూ రాగా... 2019-20 బడ్జెట్‌లో తగ్గించి చూపించారు. 2016-17లో 27.87శాతం నుంచి 2017-18లో 27.83 శాతానికి తగ్గింది. మళ్లీ మరుసటి సంవత్సరం 28.02 శాతానికి పెరిగింది. 2019-20లో సవరించిన అంచనాల మేరకు 27.97శాతానికి తగ్గింది.
రూ.67,171.48 కోట్లకు ప్రభుత్వ హామీలు
2019-20లో విద్యుత్తు రంగంలో రుణాలకు రూ.13,901.60 కోట్ల మేర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇతరత్రా రూ.53,269.88 కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినట్లు పేర్కొంటూ... మొత్తం రుణం రూ.67,171.48 కోట్లుగా చూపారు. రాష్ట్ర మొత్తంలో రెవెన్యూ వసూళ్లలో ఇది 60.49 శాతంగా ఉన్నట్లు ఏపీ బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చూడండి :కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి