ఏపీ విజయనగరం జిల్లా రామతీర్థంలోని నీలాచలం కొండపై ధ్వంసమైన శ్రీ కోదండ సీతారాముల విగ్రహాల స్థానంలో కొత్తవి తయారు చేసేందుకు ఆలయ మాజీ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అందచేసిన నగదును దేవాదాయశాఖ తిరస్కరించింది. కొత్త విగ్రహల తయారీ కోసం రూ. లక్షా 1,116ను ఈనెల 10న ఆయన చెక్కు రూపంలో దేవాదాయశాఖ అధికారులకు అందజేశారు. సీతారాముల విగ్రహాలను తితిదే తయారు చేస్తున్నందున... నగదును తిరిగి పంపుతున్నట్లు దేవాదాయ శాఖ అశోక్‌కు లేఖ పంపింది. ఇది రామతీర్థం ఆలయ సహాయ కమిషనర్ రంగారావు పేరిట జారీ అయింది. ఈ విషయంపై అశోక్ గజపతిరాజు స్పందించారు.
మొదట ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కు తూట్లు పొడుస్తూ నన్ను రామతీర్థం ఆలయ అనువంశిక ధర్మకర్తగా తొలగించారు. రామతీర్థం ఘటన కంటే ముందు... ఏపీలో పలు ప్రధాన ఆలయాల్లో వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఎక్కడా... ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కేవలం నాపై మాత్రమే చర్యలు చేపట్టారు. ఇప్పుడు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా శ్రీ రాముని కొత్త విగ్రహాల తయారీకి నేను భక్తిపూర్వకంగా ఇచ్చిన కానుకను తిరస్కరించారు. ఇదంతా చూస్తుంటే దేవస్థానానికి వ్యవస్థాపక కుటుంబాన్ని దూరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు. - అశోక్ గజపతిరాజు, రామతీర్థం ఆలయ మాజీ అనువంశిక ధర్మకర్త