తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Employees Reaction: 'కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌కు మేము వ్యతిరేకం' - పీఆర్సీపై ఏపీ ఉద్యోగుల రియాక్షన్

AP Employees Reaction on Central Government Scales: కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌కు తాము వ్యతిరేకమని ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మాస్టర్స్‌ స్కేల్స్‌ కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ ఇస్తామనడం దుర్మార్గమని పేర్కొన్నాయి. 2018 జులై 1న పీఆర్సీ అమలు చేయాలని కోరితే వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వెల్లడించాయి.

employees reaction, AP job unions
కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌

By

Published : Dec 14, 2021, 9:08 AM IST

AP Employees Reaction on Central Government Scales: కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌కు తాము వ్యతిరేకమని ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మాస్టర్స్‌ స్కేల్స్‌ కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ ఇస్తామనడం దుర్మార్గమని పేర్కొన్నాయి. తమ 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటని, మిగతా 70 సమస్యలూ పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని ప్రకటించాయి. పీఆర్సీ నివేదికపై అధ్యయనం, ఉద్యమ కార్యాచరణపై ఏపీ ఐకాస, ఐకాస అమరావతి 9మంది సభ్యులతో స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. 2018 జులై 1న పీఆర్సీ అమలు చేయాలని కోరితే వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని వెల్లడించాయి. పీఆర్సీ నివేదికను పాక్షికంగానే ఇచ్చారని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నాయి. అధికారుల కమిటీ సిఫార్సులను పరిశీలిస్తే సీఎం జగన్‌ వద్ద తప్ప కింద స్థాయిలో సమస్యలు పరిష్కారం కావనిపిస్తోందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పేస్కేల్స్‌ను ఉపాధ్యాయ సంఘాలు సైతం వ్యతిరేకించాయి. ఉద్యోగ సంఘాల నేతలు విలేకర్లతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

ఉద్యోగులు నష్టపోకూడదనే మాస్టర్‌ స్కేల్స్‌ను ఆహ్వానించాం

ఉద్యోగులకు ఏపీ, తెలంగాణల్లోనే మాస్టర్స్‌ స్కేల్స్‌ ఉన్నాయి. ఒక్క సీనియర్‌ ఉద్యోగీ నష్టపోకూడదని మాస్టర్‌ స్కేల్స్‌ను గతంలో అంగీకరించాం. మాస్టర్స్‌ స్కేల్స్‌ కాకుండా కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ అమలు చేస్తామనడం చాలా దుర్మార్గం. పీఆర్సీపై కార్యదర్శులు ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్‌ను ఐఏఎస్‌లు అధ్యయనం చేయలేదు. దీనిపై సీఎం చొరవ తీసుకోవాలి. గత పీఆర్సీలోనూ పదేళ్లకోసారి ఇస్తే బాగుండని చెప్పారు. ఉద్యోగులు మాత్రం తమకు ఆనవాయితీగా ఉన్న అయిదేళ్ల పీఆర్సీనే కావాలని కోరాం. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. పీఆర్సీ నివేదికలోని ముఖ్యాంశాలను అన్ని ఉద్యోగ సంఘాలకు ఇచ్చి, వెబ్‌సైట్‌లో పెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. 2018 జులై 1 నుంచి 50 శాతం ఫిట్‌మెంట్‌ కావాలని కోరాం. ఆర్థిక లబ్ధి వచ్చే ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రకటించడం మాకు ఇబ్బందికరం. సీఎం చొరవ తీసుకొని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సరైన లబ్ధి వచ్చేలా చూస్తారని ఆశిస్తున్నాం.

- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

71 డిమాండ్లను పరిష్కరిస్తేనే ఉద్యమవిరమణ

ఉద్యోగుల 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తాం. పీఆర్సీ నివేదిక మాత్రమే ఇచ్చారు. పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, డీఏలు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, విద్య, వైద్య శాఖల్లోని సమస్యల వంటి ప్రధాన డిమాండ్లపై చర్చలు జరపాలి. సీఎం జగన్‌ లేదా ఆయన నియమించే కమిటీతోగానీ చర్చించిన తర్వాతే ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటాం. 9 మంది సభ్యులతో నియమించిన స్ట్రగుల్‌ కమిటీ.. ఉద్యమం ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. పీఆర్సీ నివేదికలోని నాలుగు వ్యాల్యూమ్‌లను ఇవ్వలేదు. గతంలో పీఆర్సీపై ఒకసారి అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం, అనంతరం సీఎంతో చర్చించేవాళ్లం. ఇప్పుడూ ఆ సంస్కృతి కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉపాధ్యాయ సంఘాల తరపున వ్యతిరేకిస్తున్నాం

ఉపాధ్యాయ సంఘాల తరపున కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్‌ను వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులకు ప్రత్యేక స్కేల్‌ ఇవ్వాలని కొఠారి కమిషన్‌ సిఫార్సు చేసింది. దాన్ని 10వ పీఆర్సీలో పెట్టారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌డ్‌ స్కేల్‌ను 30 ఏళ్లకు పెంచడాన్ని అంగీకరించడం లేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకే కాకుండా ఇతరులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలి. సీఎం జగన్‌ చొరవ తీసుకుంటే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు.

- ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు

ప్రజలను తప్పుదారి పట్టించేలా సీఎస్‌ వ్యాఖ్యలు

ప్రభుత్వంపై భారం పడుతుందని సీఎస్‌ చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉంది. ధరలకు అనుగుణంగా పేస్కేల్స్‌ ఉండాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ఉద్యమాన్ని చేపట్టాం. చర్చల ద్వారా పరిష్కరించి, ఉద్యమం ముగించేందుకు సీఎం చొరవ తీసుకోవాలి. ఉద్యోగులు దాచుకున్న మొత్తాలపై రావాల్సిన వాటిపైనా స్పష్టత ఇవ్వాలి.

- ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి వైవీరావు

ఫిట్‌మెంట్‌ పెంచాలని సీఎంను కోరతాం

సీఎస్‌ ఆధ్వర్యంలోని అధికారుల బృందం సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్‌ ఆశాజనకంగా లేదు. ఫిట్‌మెంట్‌ పెంచాలని ముఖ్యమంత్రిని కలిసి కోరతాం. సీఎం ఈ విషయంలో ఉద్యోగులకు మేలు కలిగేలా తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కేంద్ర వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం.

- ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

అధికారుల నివేదిక ఆమోదయోగ్యం కాదు

పీఆర్‌సీ సిఫార్సులతోపాటు ఫిట్‌మెంట్‌పై సీఎస్‌ ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మాకు ఆమోదయోగ్యం కాదు. అధికారుల సిఫార్సులతో ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని సీఎంను కలిసి వివరిస్తాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాల కంటే మెరుగైన ఫిట్‌మెంట్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తారన్న ఆశాభావంతో ఉన్నాం. లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ. బోనస్‌లు కూడా ప్రకటిస్తున్నారు. వారిలాగే మాకూ జీతాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తే అప్పుడు అమలు చేసినా అభ్యంతరం లేదు.

- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

ఇదీ చదవండి:Lokpal complaint: ఇక ఆన్‌లైన్‌లోనూ లోక్‌పాల్‌కు ఫిర్యాదులు

ABOUT THE AUTHOR

...view details