పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అభివృద్ధి- కాల్వల విస్తరణ- రాయలసీమకు నీటి తరలింపు అంశంపై తెలంగాణ వ్యక్తంచేసిన అభ్యంతరాలపై... ఆంధ్రప్రదేశ్ ఘాటుగా స్పందించింది. ఈ అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అలాగే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులపైనా సంబంధిత బోర్డుకు ఫిర్యాదుచేసింది. ఈమేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణరెడ్డి... రెండు బోర్డుల ఛైర్మన్‌లను కలిసి లేఖలు అందించారు. ట్రైబ్యునల్ కేటాయింపులకు మించి నీటిని వాడుకోబోమని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు వివరించారు. తెలంగాణ కూడా ఇదే విషయం చెప్పిందని... రాయలసీమ ఎత్తిపోతల వల్ల ఆ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టంచేసింది.
ఆ తరహాలోనే ..
పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలను రెండో కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపులకు లోబడి మాత్రమే వినియోగించుకునేలా నిర్మించుకుంటామని... 2016 సెప్టెంబరులో దిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ స్పష్టం చేసిందని గుర్తుచేసింది. ఇదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీలో నిర్మిస్తున్నామని లేఖలో తెలియజేసింది. శ్రీశైలం ప్రాజెక్టు 800 అడుగుల నీటిమట్టం వద్ద కరవు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీరు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నట్టు వివరించింది. కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపులకు లోబడే నీటి వినియోగం ఉంటుందని స్పష్టంచేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి నష్టమూ లేదని లేఖలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఏపీ ప్రయోజనాలకు భంగం...
రాష్ట్ర విభజన తర్వాత మిగులు జలాల ఆధారంగా తెలంగాణ 150 టీఎంసీలను వినియోగించుకుంటూ... 16.87 లక్షల ఎకరాలకు నీరందించేలా 5 కొత్త ప్రాజెక్టులు చేపట్టిన విషయం ప్రస్తావించింది. ఇందులో పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, భక్తరామదాస్, మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ప్రాజెక్టులు ఉన్నాయని... బచావత్ ట్రైబ్యునల్‌లో వీటికి ఎలాంటి కేటాయింపులూ లేవని గుర్తుచేసింది. ఈ ప్రాజెక్టులన్నీ ఏపీ ప్రయోజనాలకు భంగకరమని స్పష్టంచేసింది. దీనిపై కృష్ణా బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వెలిబుచ్చింది. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్థ్యంతో నీటిని తీసుకోగలమని... ఆ తర్వాత కుదరదని తెలిపింది. ప్రస్తుతం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలుగుతున్నామని వివరించింది. ఏడాదిలో 10 నుంచి 15 రోజులు మాత్రమే నీటిని తీసుకోగలుగుతున్నట్టు చెప్పింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు కూడా లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌కు దిగువన, పోలవరం ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలు.... ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాళేశ్వరం సామర్థ్యం 450 టీఎంసీలకు, సీతారామ 100 టీఎంసీలకు పెంచుతున్నట్టు తెలుస్తోందని లేఖలో వివరించింది. గోదావరిలో పునరుత్పత్తి జలాలతో కలిసి రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు 14 వందల 30 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని... కానీ అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో తెలంగాణ కడుతోందని గోదావరి బోర్డు ఛైర్మన్‌కు ఏపీ అధికారులు నివేదించారు. ఇవి కాకుండా పర్యావరణ జలాల కింద మరో 16 టీఎంసీలు వదిలివేయాల్సి ఉంటుందని ప్రస్తావించారు. విశ్వసించదగిన జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం లేదని... అయితే గోదావరి బోర్డుకు ఎలాంటి డీపీఆర్లూ సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా వివిధ ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని వాదించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు నిలిపివేయాలని కోరారు.
ఇదీ చదవండి:తెలంగాణ లాక్డౌన్లో వీటికి మినహాయింపులు