పట్టణ, నగరాల్లోని పేద ప్రజలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ది శాఖపై సమీక్షించిన జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో పట్టణాలు, నగరాల్లో రాజీవ్ స్వగృహ పేరిట ఉన్న కార్యక్రమంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని సీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయిస్తుందని ఏపీ సీఎం వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేస్తున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని, సరైన టైటిల్ సహా అన్నిరకాల అనుమతులు ఉన్నాయా లేవా అనే భయాలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వమే లే అవుట్ల అభివృద్ధిని చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవన్నారు. ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలన్నారు. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని సీఎం సూచించారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకుపైగా లే అవుట్స్ వచ్చాయన్నారు.