తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2021, 8:07 AM IST

ETV Bharat / state

AP CM JAGAN:మూడో వేవ్‌ సంకేతాలపై అప్రమత్తం.. పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌

ఏపీలోని కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లోని కొవిడ్‌ పరిస్థితులపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు. కరోనాలో మూడో వేవ్‌ సంకేతాల దృష్ట్యా పీహెచ్‌సీలలోనూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.

AP CM JAGAN
సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాల్లోని కొవిడ్‌ పరిస్థితులపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ (ANDHRA PRADESH CM JAGAN) అధికారులను ఆదేశించారు. అధ్యయనం చేయబోయే రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు స్ఫూర్తిమంతంగా ఉంటే... ఏపీలోనూ వాటిని అనుసరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొవిడ్‌ పరిస్థితులపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షించారు.

‘కరోనాలో మూడో వేవ్‌ సంకేతాల దృష్ట్యా పీహెచ్‌సీలలోనూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. ఆసుపత్రుల నిర్వహణలో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్‌, ఏసీ మరమ్మతులు, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నిపుణులను నియమించాలి.

-జగన్, ఏపీ సీఎం

'జిల్లా విస్తీర్ణం, ఆసుపత్రుల సంఖ్యను అనుసరించి ఈ నియామకాలు చేపట్టాలని సూచించారు. ఐటీఐ, డిప్లమో విద్యలో ఈ కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ముందుగా వంద పడకల ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని... తర్వాత మిగిలిన ఆసుపత్రుల విషయంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్లాంట్ల ఏర్పాటులో ప్రైవేటు ఆసుపత్రులకు 30% సబ్సిడీ ఇస్తున్నామని... విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం ఊరటనిస్తోందని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్​లో టీకా పంపిణీ, కొవిడ్‌ కేసులపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. నమోదు వివరాల గురించి అధికారులు వివరించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక డోసు 1,03,24,702 మంది, రెండు డోసులు 50,46,531 మంది పొందారు. ప్రైవేటు ఆసుపత్రులకు మే నుంచి ఇప్పటివరకు 43,38,000 డోసుల వ్యాక్సిన్‌ ఇస్తే కేవలం 5,24,347 డోసులే వినియోగించారు’ అని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ‘మిగిలిన డోసులు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే టీకాల పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది. ఈ విషయమై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తా. టీకాల పంపిణీలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Covid: తస్మాత్ జాగ్రత్త... భాగ్యనగరంలోమళ్లీ విస్తరిస్తున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details