తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ దుర్ఘటన: బాధితులకు నేడు పరిహారం - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం మరోమారు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేటి సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ap cm jagan review on vishaka gas leak incident
విశాఖ దుర్ఘటన: బాధితులకు నేడు పరిహారం

By

Published : May 11, 2020, 9:43 AM IST

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం మరోమారు జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, సీఎంవో అధికారులు హాజరయ్యారు. గ్యాస్‌ లీక్‌ ప్రాంతాల్లోని పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయట పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఇవాళ సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూడాలని చెప్పారు.

ఇవాళ ఉదయం మంత్రులు, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని ఇవ్వాలని మంత్రులు, అధికారులకు చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పరిహారం బాధితులకు డోర్ ‌డెలివరీ చేయాలన్నారు. ఆర్థిక సాయం అందలేదని ఎవరూ విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని సీఎం తేల్చి చెప్పారు. అలాగే విశాఖలో స్టైరిన్‌ రసాయనం ఉంచడానికి వీల్లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వైద్యుడి చెవి కొరికిన గర్భిణి భర్త

ABOUT THE AUTHOR

...view details