కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం (ap CM Jagan) నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త వేరియంట్ హెచ్చరికల దృష్ట్యా అందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనాలు గుమిగూడకుండా చూడాలన్నారు. మాస్క్ విషయంలో ప్రత్యేక డ్రైవ్ చేయాలని, గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయాలని నిర్దేశించారు. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యమన్న సీఎం.. మాస్క్‌కు సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి..
వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఉద్ధృతంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్(cm jagan) అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమని, డిసెంబర్ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డిసెంబర్, జనవరి కల్లా అందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్న అధికారులు తెలిపారు. కేంద్రం చెబుతున్నట్లుగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్ నుంచి వస్తున్న వారిపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు.