ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ సీఎం జగన్ స్పందించారు. ఆ కిట్లు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని స్పష్టం చేశారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు.
'ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతిచ్చిన సంస్థకే ఏపీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్ పేర్కొంది. అయినా రూ.65 తక్కువకు ఏపీ ప్రభుత్వం ఆర్డర్ ప్లేస్ చేసింది. ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని సదరు ఆర్డర్‌లోనే షరతు పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినపుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయి. భారత్‌లో తయారీకి అదే సంస్థకు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వటం వల్ల కిట్ల ధర తగ్గింది. ప్రస్తుతం 25 శాతం మాత్రమే చెల్లింపులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతు వల్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించింది' అని సీఎం జగన్ వివరించారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆర్డర్ చేశామని.. ప్రజాధనాన్ని కాపాడే ఆలోచన చేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందిస్తున్నట్లు సీఎం చెప్పారు.