దిల్లీ వెళ్లిన వచ్చిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని వివరించారు. చికిత్స అందించడంలో సమగ్ర విధానం అమలు చేస్తున్నామన్న సీఎం... కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. దిల్లీ వెళ్లివచ్చిన వారివల్ల అనేకమందికి కరోనా వైరస్ సోకిందని వివరించారు. కరోనా వైరస్‌తో భయాందోళన వద్దని... ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని చెప్పారు. వయసు పైబడిన వాళ్లపై వైరస్ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుందన్నారు.
దిల్లీ వెళ్లివచ్చిన వాళ్లే 70 మంది...
దేశాల ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు సైతం కరోనా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చికిత్స తీసుకున్న తర్వాత చాలామందికి నయమైందని గుర్తు చేశారు. బాధితుల్లో దిల్లీ వెళ్లివచ్చిన వాళ్లే 70 మంది ఉన్నారన్నారు. 1,080 మంది దిల్లీ వెళ్లారన్న సీఎం... వారిలో 585 మందికి పరీక్షలు చేయగా 70 కేసులు పాజిటివ్ కేసులు వచ్చాయని వెల్లడించారు. విదేశాలకు వెళ్లివచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 104కు ఫోన్ చేసి వైద్యపరీక్షలు చేసుకోవాలని కోరారు. 14 రోజుల తర్వాత వారిని ఇంటికి పంపిస్తామన్నారు.
ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్య సిబ్బందికి చెప్పండి...
ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్య సిబ్బందికి చెప్పాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైన పరిస్థితి ఉందన్నారు. కేవలం 14 శాతం మందినే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. 5 శాతం మందికే ఐసీయూలో చికిత్స అవసరం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.