తెలంగాణ

telangana

కొత్తగా ఏపీ మంత్రివర్గంలో చేరేది ఆ ఇద్దరేనా?

By

Published : Jul 21, 2020, 9:48 AM IST

ఆంధ్రప్రదేశ్​ కేబినేట్‌లో ఖాళీ అయిన మంత్రుల స్థానాల భర్తీకి దాదాపు ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గంలోకి కొత్తగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజుల చేరిక ఖాయమైంది. బుధవారం రాజ్‌భవన్‌లో వీరిద్దరి చేత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ap-cabinet-expansion
కొత్తగా ఏపీ మంత్రివర్గంలో చేరేది ఆ ఇద్దరేనా?

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యాక... ఖాళీ అయిన మంత్రి స్థానాల భర్తీ తేదీని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది.

మంత్రివర్గంలోకి కొత్తగా.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు చేరిక ఖరారైంది. వీరిద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్‌భవన్‌లో వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వీరితో ప్రమాణం చేయించనున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి సమక్షంలో అతి కొద్దిమంది మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కొత్త మంత్రుల రాక నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవి, శాఖల కేటాయింపుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా చేరనున్న మంత్రులకు... పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ నిర్వర్తించిన బాధ్యతలను యథాతథంగా ఇస్తారా..? లేక మార్పులు ఉంటాయా..? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

బోస్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు కేటాయించనున్నారని విశ్వసనీయ సమాచారం. ధర్మానకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే... రెవెన్యూ శాఖనూ ఆయనకే అప్పగించనున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న రహదారులు-భవనాల శాఖను కొత్త మంత్రుల్లో ఒకరికి ఇచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండీ...టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం మల్లగుల్లాలు.. పీఠం ఎవరికి దక్కేనో..!

ABOUT THE AUTHOR

...view details