Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం అంతర్రాష్ట్ర సమస్య మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత అంతర్ పరీవాహక(బేసిన్) సమస్యగానూ మారిందని తెలంగాణ తరఫున సాక్షిగా హాజరైన కేంద్రజలసంఘం మాజీ ఛైర్మన్ చేతన్ పండిట్.. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు. ట్రైబ్యునల్ విచారణలో భాగంగా శుక్రవారమూ వాదనలు కొనసాగగా ఆంధ్రప్రదేశ్ తరఫు సీనియర్ న్యాయవాది అడిగిన ప్రశ్నకు పండిట్ సమాధానమిచ్చారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు సమయానికి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఉందని, అప్పుడు కృష్ణా పరీవాహకం నుంచి ఇతర బేసిన్లకు నీటిని మళ్లించినా అది ఒకే రాష్ట్రం పరిధిలో ఉండేదన్నారు.
ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నమంటూ ఇతర బేసిన్లకు జలాలను మళ్లించాలంటే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం తప్పనిసరన్నారు. దీనికి నర్మద, కెన్-బెట్వా మధ్య ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒప్పందాలను పండిట్ ఉదహరించారు. అంతర్ బేసిన్‌లో నీటి మళ్లింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదు కాబట్టి ఈ అంశానికి ప్రస్తుతం సంబంధం లేదన్నారు. అయితే బేసిన్ బయటి ప్రాంతాలను తాను తొలగించడం లేదన్నారు. తుంగభద్ర హెచ్చెల్సీ బేసిన్ బయటే ఉందన్నారు. తాను ప్రతిపాదించిన ఆపరేషన్ ప్రొటోకాల్‌లో బేసిన్ బయటి ప్రాంతానికి తక్కువ ప్రాధాన్యం ఉండాలని సూచించానని తెలిపారు. కృష్ణా డెల్టాకు నీరందించే ప్రాంతం స్వయం సమృద్ధంగా ఉన్నందున.. నాగార్జునసాగర్ నుంచి నీటి అవసరం లేదని పండిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరీవాహకానికి బయట కొంత భాగమే ఉందని, దానికి తక్కువ ప్రాధాన్యంతో నీటి సరఫరా ఉండాలని ఆయన అన్నారు.
అవార్డులకు కట్టుబడి ఉండాలి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కృష్ణా ట్రైబ్యునల్-1, ట్రైబ్యునల్-2 అవార్డులకు కట్టుబడి ఉండాలని, రాష్ట్రంలో బేసిన్ బయటి ప్రాజెక్టులూ ఉన్న కేటాయింపుల్లో భాగమే అని, వీటికి కూడా సమ ప్రాధాన్యం ఉందని ఆంధ్రప్రదేశ్ న్యాయవాది వాదించారు. కొత్త ప్రొటోకాల్ పేరుతో ఈ ప్రాజెక్టులకు నికర జలాలు రాకుండా తప్పుదోవ పట్టించడం, కృష్ణా ట్రైబ్యునల్-1, 2 తీర్పులకు విరుద్ధం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఒకరికి మించి ఎక్కువమంది సమవాటా కోరుకున్నా వనరుల సరఫరాలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. జాతీయ నీటి విధానం-2002 ప్రకారం తాగునీటికి మొదట, సాగునీటికి రెండో ఇలా నేవిగేషన్, మిగిలిన వాటికి ఆరో ప్రాధాన్యం ఇచ్చారని, ఇలా నిర్ణయించడం వారి క్లెయింను ఉల్లంఘించడం కాదని న్యాయవాది అన్నారు.
తెలంగాణ సాక్షి పండిట్ స్పందిస్తూ.. వేర్వేరు వినియోగదారులకు ప్రాధాన్యాన్ని నిర్ణయించరాదని ట్రైబ్యునల్ చెప్పినట్లు తాను అంగీకరించనన్నారు. తాను చెప్పింది బేసిన్‌లోని ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం గురించి అని, ఇది అవార్డులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కృష్ణాడెల్టాకు 181 టీఎంసీల కేటాయింపు ఉండగా, ఆధునికీకరణ తర్వాత 152 టీఎంసీలకు తగ్గిందని ఇందులో గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలు డెల్టాకు అందుబాటులో ఉంటాయన్నారు. సాగర్ దిగువ బేసిన్‌లో పులిచింతల ద్వారా 45 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని, డెల్టాకు మరో 25 టీఎంసీలే అవసరం ఉంటుందని పండిట్ పేర్కొన్నారు.
పులిచింతలలో లైవ్ స్టోరేజి 36.23 టీఎంసీలేనని ఆంధ్రప్రదేశ్ న్యాయవాది గుర్తుచేయగా, అలా అయినా 34 టీఎంసీలే అవుతుందని తెలంగాణ సాక్షి బదులిచ్చారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ వాదన జరిగింది. కృష్ణాడెల్టాకు ఉన్న 152 టీఎంసీల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వాటాలో అంతర్భాగమని ఆ రాష్ట్ర న్యాయవాది పేర్కొన్నారు. క్యారీఓవర్ స్టోరేజి కేటాయింపులపైనా చర్చ నడిచింది.